ఇస్రో నూతన చైర్మన్‌గా వి నారాయణన్‌

Jan 8,2025 08:30 #(ISRO) chairman, #ISRO

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా వి.నారాయణన్‌ కేంద్రం నియమించింది. ప్రస్తుత ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ పదవీ కాలం ముగిసిన తరువాత, అంటే ఈ నెల 14న నారాయణన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవీలో ఉంటారు. వి. నారాయణన్‌ నియామకాన్ని క్యేబినెట్‌ నియామకాల కమిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.  జనవరి 14 నుండి రెండేళ్ల పదవీకాలానికి లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు, ఏది ముందుగా వస్తే అప్పటివరకు ఆయన కొనసాగుతారని ఆ ప్రకటన పేర్కొంది. ఇస్రో చైర్మన్‌గా వ్యవహరించడంతో పాటు స్పేస్‌ కమిషన్‌ చైర్మన్‌గాను వ్యవహరిస్తారని తెలిపింది.

నారాయణన్‌ ప్రస్తుతం వల్లమలలోని లిక్విడ్‌ ప్రోపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ (ఎల్‌పిఎస్‌సి) డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  భారత అంతరిక్ష రంగంలో నారాయణన్‌కు దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉంది. అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నప్పటికీ.. భారతదేశంలో క్రయోజెనిక్‌ ఇంజిన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో  కీలక పాత్ర పోషించారు. ఆయన మార్గదర్వకత్వంలో జిఎస్‌ఎల్‌వి ఎంకె 3లోని కీలక భాగమైన సి 25ను నిపుణుల బృందం  విజయవంతంగా అభివృద్ధి చేసింది.

ఐఐటి ఖరగ్‌పూర్‌ నుండి క్రయోజెనిక్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పిహెచ్‌డి పూర్తి చేశారు. 1984లో ఇస్రోలో అడుగుపెట్టిన ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలను చేపట్టారు. 2018లో లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (ఎల్‌పిఎస్‌సి)లో డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

 

➡️