6 గంటల పాటు వాద్రా విచారణ

  • నేడు మరోసారి విచారణకు పిలుపు

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మంగళవారం 6 గంటలకు పైగా విచారించింది. బుధవారం మరోసారి విచారణకు రావాలని కోరింది. 2008లో హర్యానాలో జరిగిన భూ ఒప్పందంపై ఈ మనీలాండరింగ్‌ కేసును ఇడి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 8న ఇడి వాద్రాకు సమన్లు జారీ చేసింది. వాద్రా వాటికి స్పందించకపోవడంతో తాజాగా మరోసారి మంగళవారం సమన్లు జారీ చేసింది. దీంతో ఢిల్లీలోని ఇడి కార్యాలయానికి మంగళవారం ఉదయం 11 గంటలకు వాద్రా చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ విచారణ సాగింది. విచారణ కోసం ఎపిజె అబ్దుల్‌ కలాం రోడ్డులోని ఇడి కార్యాలయానికి సుజన్‌ పార్క్‌లో ఉన్న తన నివాసం నుంచి వాద్రా కాలినడక వెళ్లారు. దాదాపు 2 కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్లారు.
రాజకీయ వేధింపుల్లో భాగంగానే కేసు : వాద్రా
ఈ సందర్భంగా వాద్రా విలేకరులతో మాట్లాడారు. ఇది దాదాపు 20 ఏళ్ల నాటి కేసు అని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ కేసు నమోదయిందని విమర్శించారు. ‘నేను ప్రజల ప్రయోజనాల కోసం లేదా మైనార్టీల ప్రయోజనాల కోసం లేదా ప్రభుత్వ లోపాల గురించి మాట్లాడినప్పుడల్లా ఈ కేసు విచారణను ప్రారంభిస్తారు’ అని అన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 15 సార్లు విచారణకు హాజరయ్యాయని గుర్తు చేశారు. ఈ కేసులో ఏమీలేదనీ, నిజంగా ఏమైనా ఉంటే కనుగొనడానికి 20 ఏళ్లు పట్టదని విమర్శించారు.

➡️