వందేభారత్‌ – జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం

గయ (బీహార్‌) : బీహార్‌లోని గయ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. గయ జిల్లాలో ఉన్న ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే గ్రాండ్‌ కార్డ్‌ రైల్వే సెక్షన్‌ పరిధిలోని మాన్‌పూర్‌ జంక్షన్‌లో హోం సిగల్‌ దగ్గర ఓవర్‌హెడ్‌ వైరు తెగిపోయింది. ఈ నేపధ్యంలో రాంచీ-పట్నా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌, రాంచీ-పట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను ముందుజాగ్రత్త చర్యగా అంతకు ముందున్న స్టేషన్‌లలో నిలిపివేశారు. తెగిన వైర్‌ను సరిచేయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టడంతో వందే భారత్‌, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలోని ప్రయాణికులు అవస్థలుపడ్డారు. మాన్‌పూర్‌ జంక్షన్‌ హోం సిగల్‌ సమీపంలో ఓవర్‌ హెడ్‌ వైరు తెగిపోవడంతో రైల్వే సిబ్బంది వెంటనే కంట్రోల్‌ రూం కు సమాచారం అందించారు. దీంతో ట్రాక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, ఇతర విభాగాలకు చెందిన బఅందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి తొమ్మిది గంటలకు మరమ్మతు పనులు పూర్తయ్యాక ఈ మార్గంలోని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను గుర్పా రైల్వే స్టేషన్‌లో, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను టంకుప్ప రైల్వే స్టేషన్‌లో నిలిపివేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

➡️