పోర్ట్‌విలా : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ పౌరసత్వాన్ని రద్దు చేయనున్నట్లు వనౌటు ప్రధాన మంత్రి జోథమ్ నపట్ ప్రకటించారు. లలిత్ మోడీ వనువాటు దేశ పాస్‌పోర్టు రద్దు చేయడానికి చేయడానికి అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించాలని జోథమ్ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించినట్లు సోమవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో పన్ను ఎగవేత, నిధుల దుర్వినియోగం కేసులలో విచారణ ఎదుర్కొంటున్న లలిత్ మోడీని అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. భారత్ హెచ్చరికల నేపథ్యంలో గడచిన 24 గంటల్లో ఇంటర్‌పోల్ (ద ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) రెండుసార్లు తిరస్కరించిందని తమకు తెలిసిందని ఈ సందర్భంగా జోథమ్ వెల్లడించారు. ఇంటర్‌పోల్ జారీ చేసిన హెచ్చరిక తర్వాత లలిత్ మోడీ పౌరసత్వ దరఖాస్తు తిరస్కరించబడిందని వనౌటు ప్రధాని తెలిపారు.
కాగా, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన వనౌటు పౌరసత్వం కోసం లలిత్ మోడీ దరఖాస్తు చేసుకున్నారని.. దీనికోసం తన భారతీయ పాస్‌పోర్టును అప్పగించడానికి లలిత్ మోడీ దరఖాస్తు చేసుకున్నారని, ఈ దరఖాస్తును పరిశీలిస్తున్నామని తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపిన సంగతి తెలిసిందే. లలిత్ మోడీ గత పదేళ్లుగా లండన్‌లో నివశిస్తున్నారు.