వారణాసి : నేడు ప్రధాని మోడీ వారణాసికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన ఇటీవల వారణాసిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన గురించి పోలీస్ కమిషనర్, డివిజనల్ కమిషనర్, జిల్లా మెజిస్ట్రేట్‌లను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని మోడీ అధికారులకు ఆదేశించారు. ప్రధాని మోడీ ఈరోజు వారణాసిలో పలు రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
కాగా, వారణాసిలో ఓ 19 ఏళ్ల యువతిపై 23 మంది ఆరురోజులపాటు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి.. ఆమెను పలు హోటళ్లకు తిప్పి అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఏప్రిల్ 4న వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లాల్‌పూర్ పాండేపూర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు.
