న్యూఢిల్లీ : స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్టోబర్ 5న జరగబోయే హర్యానా ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ‘ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో నాపై అనర్హత వేటుపడిన సమయంలో నాకు ప్రధానిమోడీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ మోడీ నుంచి నేరుగా నాకు రాలేదు. అక్కడ ఉన్న భారత అధికారులు పీఎం మోడీ నాతో మాట్లాడాలనుకుంటున్నారని నాకు తెలియజేశారు. అయితే నేను ఆయనతో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నా. కానీ అధికారులు నాకు కొన్ని షరతులు పెట్టారు. నా బృందం నుంచి ఎవరూ మోడీతో మాట్లాడవద్దని చెప్పారు. అటు ప్రధాని వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా కోసం సంభాషణను రికార్డ్ చేస్తారని చెప్పారు. నా భావోద్వేగాలు, కషిని సోషల్ మీడియాలో ఎగతాళి చేసుకోవటాన్ని నేను ఇష్టపడలేదు. సంభాషణను ప్రచారం చేసే షరతు లేకుండా ప్రధాని నుంచి నిజమైన కాల్ వస్తే.. నేను తప్పకుండా అభినందించేదానిని. ఆయన నిజంగా అథ్లెట్ల గురించి శ్రద్ధ వహిస్తే.. రికార్డ్ చేయకుండా కాల్ చేసి ఉండేవారు. అప్పుడు నేను ఆయనకు కృతజ్ఞుతగా ఉండేదాన్ని. కానీ పిఎం మోడీ కార్యాలయం షరతులు విధించింది. నాతో మాట్లాడితే గత రెండేళ్ళ గురించి అడుగుతానని మోడీకి తెలిసి ఉండవచ్చు. బహుశా అందుకే నా వైపు నుంచి ఫోన్ మాట్లాడే బందం ఉండకూడదని అధికారులు సూచించారు. ఇలా అయితే.. వారు మాట్లాడిన వీడియో వారికి అనుకూలంగా ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. మాములుగా మాట్లాడితే.. నేను ఒరిజినల్ కాల్‌ను బయటపెడతానని వారికి తెలుసు” అని అన్నారు.
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో వంద గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. పారిస్ రాగానే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.