ప్రతిపక్షాల తీరు సరికాదంటూ రాజ్యసభ చైర్మన్ వాకౌట్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఒలింపిక్స్‌లో వినేష్ ఫొగాట్ అనర్హత అంశాన్ని లేవనెత్తడానికి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ అనుమతించకపోవడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రతిపక్షాల తీరు సరికాదంటూ ఆయన కూడా వాకౌట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేష్‌ను అనర్హురాలిగా ప్రకటించిన అంశంలో రాజకీయ కుట్ర ఉన్నదని, దానిపై చర్చ చేపట్టాలని గురువారం రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. జగదీప్ ధనకర్, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆయన తన చైర్ నుంచి లేచి.. సభ్యులకు దండం పెట్టి, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సాధారణంగా ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తుంటే, చైర్‌లో కూర్చుండే చైర్మన్ జగదీప్.. గురువారం ప్రతిపక్ష సభ్యులపై తన ఆక్రోశాన్ని చూపించారు. కాంగ్రెస్ ఎంపి జైరాం రమేష్ నవ్వుతున్న తీరును ధన్‌ఖర్ తప్పుపట్టారు. నీ ప్రవర్తన నాకు తెలుసన్నారు. చైర్ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. తనను కాదు.. చైర్‌పర్సన్ పోస్టును ఛాలెంజ్ చేస్తున్నారని, చైర్‌లో కూర్చున్న వ్యక్తి సమర్థుడు కాడన్న ఉద్దేశంతో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నట్లు ధన్‌ఖర్ ఆరోపించారు. జైరాం రమేష్ దిక్కుకు చూస్తూ.. ఇప్పుడు తనకు ఆప్షన్ లేదని, ఈరోజు జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే, ఇక్కడ కూర్చునే పొజిషన్‌లో తాను లేనట్లు అనిపిస్తోందని జగదీప్ తెలిపారు. ఆ తరువాత లేచి నిలబడ్డ ఆయన, చేతులు జోడించి దండం పెట్టి, సభ నుంచి వాకౌట్ చేశారు. మళ్లీ కాసేపయ్యాక వచ్చిన ధన్‌ఖర్.. సభలో వాతావరణం ఆమోదయోగ్యంగా లేదన్నారు. తనకు తాను ఆత్మపరిశీలన చేసుకున్నానని, ఆ తరువాతే ఫ్లోర్ లీడర్ల భేటీకి పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఫొగాట్‌పై వేటు పడడానికి కారణం ఏంటో తెలియాలని ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి జెపి నడ్డా మాట్లాడుతూ ”దేశం మొత్తం వినేష్‌కు అండగా నిలుస్తోంది. దురదృష్టవశాత్తు, దీనిని అధికార, ప్రతిపక్షాల మధ్య విభజిస్తున్నారు” అని అన్నారు.
ఉల్లి ధరలు పెరుగుదలపై ఆందోళన
దేశంలో ఉల్లి, కూరగాయల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ముఖద్వారం వద్ద ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష ఎంపిలు గురువారం పార్లమెంటు వెలుపల నిరసన చేపట్టారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని వినూత్న నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లిధర తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి ఎంపి మనోజ్ ఝా మాట్లాడుతూ ‘ప్రభుత్వం మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వడం చాలా పెద్ద సమస్య. మరోవైపు పార్లమెంటులో క్రీడాకారుల(అథ్లెట్లు)పై చేసిన ఖర్చుల లెక్కలు చెప్పేటప్పుడు మాత్రం ప్రభుత్వం సిగ్గుపడదు. ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రుల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం వివరించాలి’ అని ఆయన అన్నారు. శివసేన (థాకరే) ఎంపి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వారి ఆదాయం సంగతి పక్కనబెడితే, వారు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉల్లి రైతులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనుమతించకుండా, గుజరాత్ రైతులకు అనుమతిస్తారు. అందుకే మేము నిరసన తెలుపుతున్నాం’ అని అన్నారు.
Vinesh Phogat :వినేష్ ఫొగాట్ అనర్హతపై ప్రతిపక్షాలు వాకౌట్
