డబ్ల్యుఎఫ్‌ఐ సస్పెన్షన్‌ రద్దుపై స్పందించిన వినేష్‌ ఫోగట్‌

న్యూఢిల్లీ :   క్రీడాశాఖ భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) సస్పెన్షన్‌ను రద్దు చేయడంపై మాజీ రెజ్లర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినేష్‌ ఫోగట్‌ స్పందించారు. సస్పెన్షన్‌ రద్దు తనను ఆందోళనకు గురిచేసిందని అన్నారు. డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ సంజయ్ సింగ్‌ ఒక డమ్మీ అని, బ్రిజ్‌ భూషణ్‌ వెనుక ఉండి రెజ్లింగ్‌ను నడిపిస్తున్నారని అన్నారు.  హర్యానా అసెంబ్లీలో గురువారం గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఇటీవల జులానా నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన వినేష్‌ ఫోగట్‌ మాట్లాడారు.

ప్రస్తుతం తాను గర్వంతో, బాధతో ఇక్కడ ఉన్నానని అన్నారు. తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం ఎంతో చేసిందని పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు చెబుతున్నారని అన్నారు. రెండు సంవత్సరాలుగా వీధుల్లో ఆందోళనలు చేపట్టామని, ఇప్పటికీ రెజ్లింగ్‌ క్రీడను కాపాడుకునేందుకు పోరాడుతున్నామని బాధతో చెబుతున్నానని అన్నారు. కానీ రెండు రోజుల క్రితం మీ పార్టీ (బిజెపి) రెజ్లింగ్‌ను తిరిగి అతని చేతుల్లో పెట్టిందని బ్రిజ్‌భూషణ్‌ పేరు ప్రస్తావించకుండా అన్నారు.
ప్రస్తుతం తాను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ.. బ్రిజ్‌భూషణ్‌కి వ్యతిరేకంగా ఏ పార్టీ ప్రతినిధులుగా తాము ఆందోళనను ప్రారంభించలేదని, క్రీడాకారులుగానే తమ గొంతుకను వినిపించామని  అన్నారు. ఒక క్రీడాకారుడు ఎప్పటికీ క్రీడాకారుడిగానే ఉంటారని స్పష్టం చేశారు.  వర్ధమాన క్రీడాకారుల భవిష్యత్తు కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని హర్యానా ప్రభుత్వాన్ని కోరారు.

➡️