తొమ్మిదో రోజుకు చేరిన వాంగ్‌ఛుక్‌ దీక్ష

Oct 15,2024 00:24 #Initiation, #ninth day, #Wangchuck's
  • మద్దతుదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

న్యూఢిల్లీ : లడఖ్‌లో ఆరో షెడ్యూల్‌ అమలు కోసం, రాష్ట్ర హోదా కోసం వాతావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌ఛుక్‌, ఆయన మద్దతుదారులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారం తొమ్మిదవ రోజుకు చేరింది. కాగా లడఖ్‌ భవన్‌ వెలుపల శాంతియుతంగా దీక్ష చేస్తున్న 60 మంది వాంగ్‌ఛుక్‌ మద్దతుదారులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. దీక్షలో ఉన్న ఆందోళనకారులను తొలుత చెదరగొట్టిన పోలీసులు, ఆ తర్వాత వారిలో కొందరిని అరెస్ట్‌ చేశారు. లడఖ్‌ భవన పరిసరాలలో బారికేడ్లు ఏర్పాటు చేసి మీడియాతో కార్యకర్తలు మాట్లాడకుండా అడ్డుకున్నారు. వాంగ్‌ఛుక్‌తో పాటు దీక్షలో ఉన్న లెహ్ అపెక్స్‌ బాడీ సభ్యుడు జగ్‌మిత్‌ పల్జోర్‌ బారికేడ్లను దాటి వెలుపలికి వచ్చి పాత్రికేయులతో మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమను ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. క్లయిమేట్‌ మార్చ్‌్‌లో భాగంగా వాంగ్‌ఛుక్‌, మరో 150 మంది నిరసనకారులు లెV్‌ా నుండి దేశ రాజధానికి పాదయాత్రగా బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే వారిని సింఘు సరిహద్దు వద్దనే పోలీసులు అడ్డుకొని రెండు రోజుల పాటు నిర్బంధించారు. ఆ తర్వాత రాజ్‌ఘాట్‌లో దీక్ష చేపట్టి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హామీతో విరమించారు. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోకపోవడంతో నిరవధిక దీక్షకు దిగారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వంద మందిపై పోలీసులు ఆదివారం దాష్టీకం ప్రదర్శించారు.

➡️