Waqf Act Amendment Bill : వక్ఫ్‌ సవరణ బిల్లు.. దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి : కె.సి వేణుగోపాల్‌

Aug 8,2024 16:36 #k.c venugopal, #Waqf Board Bill

న్యూఢిల్లీ : గురువారం లోక్‌సభలో వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఈ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థపై దాడికి పూనుకుందని కాంగ్రెస్‌ ఎంపి కె.సి వేణుగోపాల్‌ ధ్వజమెత్తారు. ఈరోజు లోక్‌సభలో వేణుగోపాల్‌ ఈ బిల్లుపై మాట్లాడుతూ.. ‘హిందువులుగా మనం ఇతర మతాల విశ్వాసాన్ని గౌరవిస్తాం. కానీ ఈ బిల్లు రాజ్యాంగంపై ప్రాథమిక దాడి. ఈ బిల్లు ద్వారా కేంద్రం మత స్వేచ్ఛపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ విభజన రాజకీయాలని దేశ ప్రజలు అంగీకరించరు. మేము హిందువులమే. అదే సమయంలో మేము ఇతర మతాల విశ్వాసాన్ని గౌరవిస్తాము. ఈ బిల్లు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు గుణపాఠం చెప్పినా మీకు అర్థం కాలేదు.’ అని ఆయన అన్నారు.
‘ఈ బిల్లు రాజ్యాంగంపై ప్రాథమిక దాడి. ఈ బిల్లు ద్వారా వక్ఫ్‌ పాలకమండలిలో ముస్లిమేతరులు కూడా సభ్యులుగా ఉండేలా నిబంధన పెడుతున్నారు. ఇది మతస్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి. ముస్లింలు తర్వాత మీరు క్రిస్టియన్లవైపు వెళతారు. ఆ తర్వాత జైనులు. ఇలాంటి విభజన రాజకీయాలను కొనుక్కోవడానికి భారత ప్రజలు ఇప్పుడు సిద్ధంగా లేరు’ అని వేణుగోపాల్‌ అన్నారు.
కాగా, కెసి వేణుగోపాల్‌ వ్యాఖ్యలతో సభలో గందరగోళం ఏర్పడింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి వేణుగోపాల్‌ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ప్రతిపక్ష నేతలు సభలో గందరగోళం సృష్టించాలనుకుంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో కొంతమందిని తప్పుదారి పట్టంచాలనుకుంటున్నారు. దేశ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మా మంత్రి సవివరంగా వివరిస్తారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశాల్లో మనది కూడా ఒకటి అని ప్రహ్లాద్‌ జోషి అన్నారు.

 

➡️