Waqf (Amendment) Bill : వక్ఫ్‌ బిల్లు నివేదికను సోమవారం లోక్‌సభకు సమర్పించనున్న జెపిసి

న్యూఢిల్లీ : వక్ఫ్‌ (సవరణ) బిల్లు 2024 నివేదికను జెపిసి (జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ) కమిటీ సోమవారం (ఫిబ్రవరి 3) లోక్‌సభకు సమర్పించనుంది. ఈ వక్ఫ్‌బిల్లును ఎన్‌డిఎ సభ్యులు ఏకపక్షంగా ఆమోదించుకున్నారని ప్రతిపక్ష ఎంపీలు మండిపడుతున్నారు. ఈ కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్‌ ఎంపి సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘ఈ కమిటీలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. ఈ బిల్లును నేను వ్యతిరేకిస్తూ వివరణాత్మక నోట్‌ను కమిటీకి సమర్పించాను. అయితే ఆశ్చర్యకరంగా నేనిచ్చిన నోట్‌లోని కొన్ని భాగాలు నాకు తెలియకుండానే సవరించారు’ అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, ఈ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన 44 సవరణల్ని జెపిసి కమిటీ తిరస్కరించింది. ఈ కమిటీలో ఎన్‌డిఎ సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణల్ని ఆమోదించింది. ఈ సవరణలకు ఎన్‌డిఎ సభ్యులు 16 మంది మద్దతు తెలిపారు. ప్రతిపక్షానికి చెందిన 10 మంది వ్యతిరేకించారు.

➡️