వక్ఫ్‌ సవరణ రాజ్యాంగ వ్యతిరేకం

  • సుప్రీంలో ఎస్‌పి ఎంపి పిటిషన్‌

న్యూఢిల్లీ : వక్ఫ్‌ (సవరణ) చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, ఈ నిబంధనలను సమీక్షించాలని కోరుతూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) ఎంపి జియా ఉర్‌ రెహమాన్‌ బార్క్‌ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ చట్టానికి చేసిన సవరణలు ముఖ్యంగా ‘వక్ఫ్‌ బై యూజర్‌’ అనే పదాన్ని తొలగించడం, వక్ఫ్‌ కౌన్సిళ్లలో ముస్లిమేతరులను చేర్చడం, ముస్లిములపై ఐదేళ్ల ఆంక్షలు విధించడం వంటివి ప్రాధమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్నారు. ఈ నిబంధనలను సమీక్షించాలని ఆ పిటిషన్‌లో ఎస్‌పి నేత కోరారు. ఈ నిబంధనలు అన్యాయంగా, అనవసరంగా ముస్లిముల మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయని బార్క్‌ తరపు న్యాయవాది సులేమాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని మూడవ భాగంలో పేర్కొన్న ప్రాధమిక హక్కులను ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని, ముస్లిం సమాజానికి చెందిన అనేక ఆస్తులను ఇవి లాక్కుంటాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాది సులేమాన్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ, వక్ఫ్‌ కౌన్సిల్‌లో, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చడం పూర్తి రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. ఐదేళ్లకుపైగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నట్లు ముస్లిం రుజువు చేసుకోవడం తప్పనిసరి చేస్తూ ఆంక్షలు విధించడమనేది పూర్తిగా ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ముస్లిమేతరుల విరాళాలపై నిషేధం కూడా రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఈ అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు సావధానంగా విచారించాలని కోరారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నేతలు కోర్టు మెట్లెక్కారు. వీరిలో ఎంఐఎం చీఫ్‌ ఒవైసి, ఆప్‌ ఎంఎల్‌ఎ అమనతుల్లా ఖాన్‌, కాంగ్రెస్‌ ఎంపి మహ్మద్‌జావేద్‌, ఆర్‌జెడి ఎంఎల్‌ఎ మహ్మద్‌ ఇజార్‌ ప్రభృతులు ఉన్నారు.

➡️