Wayanad landslide: వయనాడ్‌ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి – లోక్‌సభలో రాహుల్‌ గాంధీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేరళ వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విపత్తుపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. జీరో అవర్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ.. వయనాడ్‌ విపత్తు అంశాన్ని ప్రస్తావించారు. వయనాడ్‌లో బాధితులను ఆదుకునేందుకు వివిధ వర్గాల వారు ముందుకురావడం హర్షణీయమన్నారు. ఇటీవల తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వయనాడ్‌లో పర్యటించామన్నారు. భయంకరమైన విధ్వంసాన్ని, జనాల బాధలను కళ్లారా చూశానన్నారు. కొండచరియలు విరిగిపడి రెండు కిలోమీటర్ల వరకు రాళ్ల కుప్పలు ఉన్నాయన్నారు. విపత్తులో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని.. పెద్ద సంఖ్యలో జనం గల్లంతయ్యారన్నారు. సంఘటనా స్థలంలో సేవలందిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అందిస్తున్న సహాయాన్ని సైతం ప్రశంసించారు. కొండచరియలు విరిగిపడడంతో ప్రధాన రహదారి తెగిపోయిందని, దాంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో రెస్క్యూ బృందాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. అయితే ఈ విపత్తులో చాలా సందర్భాలలో కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ప్రాణాలతో బయటపడటం చాలా బాధాకరమన్నారు.

➡️