తిరువనంతపురం : కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వయనాడ్‌లో రేపు (ఆగస్టు 10వ తేదీ) ప్రధాని మోడీ పర్యటించనున్నారని కేరళ సిఎం పినరరు విజయన్ చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రధాని పర్యటిస్తారని, బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో ఆయన సానుకూలంగా స్పందించారని సిఎం విజయన్ చెప్పారు.
తమ వినతి మేరకు 9 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించిందన్నారు. ఈ నిపుణుల కమిటీ విపత్తు తీవ్రతను అంచనా వేసి నివేదిక ఇస్తుందన్నారు. ఈ దర్ఘుటనలో 131 మంది వరకు గల్లంతైనట్లు గుర్తించామన్నారు. వీరి కోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు. వయనాడ్ విషాదం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తున్న వేళ మోడీ పర్యటనకు రావడం గమనార్హం.
