- శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే
- కొలంబోలో సిపిఎంసహా ఇండియా వామపక్ష నేతలతో భేటీ
- కేరళలో పర్యటించి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ అనుభవాన్ని తెలుసుకుంటాం
ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : శ్రీలంకలో ఉన్న అన్ని ప్రాంతీయ, జాతి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని శ్రీలంక అధ్యక్షుడు, జెవిపి నాయకుడు అనుర కుమార దిసనాయకే పునరుద్ఘాటించారు. కొలంబోలోని జెవిపి ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టిల్విన్ సిల్వా, పార్లమెంట్ స్పీకర్ జగత్ విక్రమరత్న, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎఆర్ సింధుతో పాటు ఇండియా వామపక్ష నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌పిపి ప్రభుత్వం తీసుకున్న ప్రజానుకూల చర్యలపై వివరణాత్మకంగా చర్చించారు. ఐఎంఎఫ్ పట్ల తమ విధానం గురించి వెల్లడించారు. ఆ ప్రాంతంలోని వామపక్షాల్లో ఉన్న ఆందోళన తనకు, తన పార్టీకి తెలుసని దిసనాయకే అన్నారు. తమిళ, ముస్లిం జనాభా సమస్యల పట్ల జెవిపి, ఎన్‌పిపి వైఖరి మారిందని తెలిపారు. అందుకే ఆ వర్గాలన్నీ ఎన్‌పిపిని అధికారంలోకి తీసుకొచ్చాయన్నారు. ఆర్థిక, ఇతర పరిమితుల మధ్య ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పరస్పర సహకారంతో దక్షిణాసియాలో వామపక్షాల బలోపేతానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కేరళను సందర్శించి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ పాలనానుభవాన్ని తెలుసుకోవాలనుందన్న ఆసక్తిని వెలిబుచ్చారు. జెవిపి ప్రధాన కార్యదర్శి టిల్విన్ సిల్వా ఎన్‌పీపీ ప్రభుత్వం ముందున్న సవాళ్లను, రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని వివరించారు.
జెవిపి ఆహ్వానం మేరకు ఇండియాకు చెందిన వామపక్ష పార్టీల నేతలు ఎఆర్ సింధు సిపిఎం, బినరు విశ్వం (సిపిఐ), జి.దేవరాజన్ (ఫార్వర్డ్ బ్లాక్)లతో పాటు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. మేడే రోజు శ్రీలంక రాజధాని కొలంబోలో నిర్వహించిన భారీ ర్యాలీలో దిసనాయకేతో పాటు కమ్యునిస్టు నేతలంతా పాల్గొన్నారు.
శ్రీలంక విజయం దక్షిణాసియా దేశాలకు ప్రేరణ : ఎఆర్ సింధు
ఈ సందర్భంగా ఎఆర్ సింధు మాట్లాడుతూ శ్రీలంకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రమజీవులకు భారతదేశ కార్మికర్గం, సిపిఎం తరఫున విప్లవాత్మక శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన ప్రపంచం కోసం ధైర్యంగా పోరాడిన హేమార్కెట్ వీరులు సహా అసంఖ్యాక అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా గర్వంగా, గౌరవంగా గుర్తుచేసుకుంటున్నామన్నారు. శ్రీలంకలో వామపక్షాల విజయం కార్మిక వర్గ ఉద్యమానికి, వామపక్షాలకు, ముఖ్యంగా దక్షిణాసియా దేశాల వారికి ప్రేరణగా ఉన్నాయని వెల్లడించారు.
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, కేరళ వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక దిగ్బంధనంలో కేరళ శ్రీలంక మార్గంలో వెళుతుందని తమ ప్రత్యర్థులు అనేవారని అన్నారు. ఇక్కడ విజయం తరువాత శ్రీలంక కేరళ మార్గంలో వెళుతుందని, ఇప్పుడు భారతదేశం శ్రీలంక మార్గంలో వెళుతుందని, శ్రీలంక నయా ఉదారవాద శక్తులను ఓడించిందని తాము గర్వంగా చెబుతున్నామని అన్నారు. జెవిపి, ఎన్‌పిపి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ఉంటుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. చారిత్రాత్మక మేడే సందర్భంగా శ్రామికవర్గ అంతర్జాతీయవాదాన్ని సమర్థిస్తూ ఈ ర్యాలీని భారీ విజయంతో విజయవంతం చేసిన శ్రీలంక కార్మికులను, శ్రమించే ప్రజలను, జెవిపి కార్యకర్తలు, నాయకులను అభినందిస్తున్నామన్నారు.