పోరాడతాం..గెలుస్తాం…

కొల్లాం: ‘మేం పోరాడతాం.. గెలుస్తాం’ అని నినదిస్తూ సిపిఎం మహిళా నేతలు శనివారం మార్చ్‌ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్పొరేట్‌, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా సిపిఎం కేరళ రాష్ట్ర 24వ మహాసభ జరుగుతున్న కొడియేరి బాలకృష్ణన్‌ నగర్‌ నుంచి వి పార్క్‌ వరకూ శనివారం ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, సమానత్వం, న్యాయం కోరుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహిళల హక్కులపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌, సుభాషిణి అలీ, కేంద్ర కమిటీ సభ్యులు పికె శ్రీమతి, కెకె శైలజ టీచర్‌, సిఎస్‌ సుజాత, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.మెర్సికుట్టి అమ్మ, సుసాన్‌ కోడి ఈ మార్చ్‌కు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ లింగ, వర్గ అణచివేత నిర్మూలన, మహిళల విముక్తి, విప్లవాత్మక పరివర్తన ప్రాధాన్యతను వివరించారు. పితృస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం రెండూ మహిళలను అణచివేస్తాయని, సమసమాజం కోసం నిర్వహించే విస్తృత పోరాటాల నుంచే మహిళల విముక్తి కలుగుతుందని స్పష్టం చేశారు. మహిళలపై పెరుగుతున్న హింస, వివక్షను అరికట్టడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మహిళలపై దారుణాలను చూసీచూడనట్లు పదేపదే వ్యవహరిస్తున్న కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక హింస, వరకట్న మరణాలు, లింగ పక్షపాతం, మహిళలపై నేరాలు పెరగడానికి ఈ వైఖరే కారణమని చెప్పారు. బేటీ బచావో బేటీ పడావో ప్రచార కార్యక్రమంగానే ఉందని, ఇది దేశంలోని మహిళలు, పిల్లల అవసరాలను తీర్చడానికి, సమస్యలను పరిష్కరించడానికి ఏమాత్రం ఉపయోగపడడం లేదని విమర్శించారు. మహిళల భద్రత, విద్య, గౌరవంపై దృష్టి పెట్టడానికి బదులుగా, మహిళా సాధికారత పునాదులను దెబ్బతీసే కార్పొరేట్‌ అనుకూల, మతపరమైన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. ఈ ఎజెండా ఉన్నత వర్గాలకు, కార్పొరేట్‌ ప్రయోజనాలకే ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల మహిళలు, ముఖ్యంగా పేదలు, గ్రామీణ, మైనారిటీ మహిళలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హింస, అసమానతలను శాశ్వతం చేసే పితృస్వామ్య, పెట్టుబడిదారీ విధానాలను కూల్చివేసేందుకు, న్యాయం, సమానత్వం కోసం పోరాటానికి, మహిళా విముక్తి కేంద్రంగా ఉన్న సమాజం కోసం పోరాడటానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ సిపిఎం రాష్ట్ర మహాసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

➡️