శతకోటీశ్వర్ల పన్నుపై మీరెటు?

Jun 10,2024 00:17 #Congress, #Jairam Ramesh
  • మద్దతిస్తారా? లేదా పేదలపైనే భారాలేస్తారా?
  • కేంద్రానికి జైరాం రమేశ్‌ ప్రశ్న

న్యూఢిల్లీ : శ్రమజీవుల కష్టార్జీతంతో కోట్లకు పడగలెత్తిన శతకోటీశ్వర్లపై పన్నులు (బిలియనీర్‌ ట్యాక్స్‌) విధించాలంటూ ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో నూతన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టేవారికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఇదే అంశంపై ప్రశ్నలు సంధించారు. ‘బిలియనీర్‌ పన్నుపై మీరెంటుంటారు?’ అని ఆయన నిలదీశారు. శతకోటీశ్వర్లపై పన్ను విధించడానికి మద్దతు ఇస్తారా? లేదా ఎప్పటిలాగే పేదలపై భారాలు మోపడం కొనసాగిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీ సామాన్యుడి వైపు ఉంటారా? లేకా బిలియనీర్ల వైపు నిలబడతారా? అని నిలదీశారు. ‘సామాన్యుల వైపు ఉంటారా? లేదా బిలియనీర్ల వైపు నిలబడతారా? అనే విషయం నిరూపించేందుకు ఈ ఏడాది ఓ అవకాశం రానుంది. బ్రెజిల్‌లో జరిగే జి20 సమావేశంలో బిలియనీర్లపై పన్ను విధించే ప్రతిపాదనపై చర్చ జరగనుంది. దీనికి బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, దక్షిణాఫ్రికా, జర్మనీల ఆర్థిక మంత్రులు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత తదుపరి ఆర్థిక మంత్రి దీన్ని సమర్థిస్తారా?’ అని జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. వ్యవస్థలో లోపాలు, షెల్‌ కంపెనీలు, ఇతర మార్గాలను ఉపయోగించుకొంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు శ్రామిక వర్గం కంటే తక్కువ పన్నులు కడుతున్నారని కాంగ్రెస్‌ నేత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే న్యాయమైన వాటా చెల్లించేందుకు గాను బిలియనీర్లపై గ్లోబల్‌ మినిమమ్‌ టాక్స్‌ చెల్లించే అంశంపై జి20లో చర్చ జరగనుందని ఆయన తెలిపారు.

➡️