న్యాయవ్యవస్థ అధికారాల సంగతేంటి?

Jan 9,2025 04:20 #powers, #the judiciary?, #What about
  • సూటిగా ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
  • సిఇసి, ఇసిల నియామక వ్యవహారంపై ఫిబ్రవరిలో విచారణ

న్యూఢిల్లీ : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి), ఎన్నికల కమిషనర్ల (ఇసి) నియామకాలకు సంబంధించి 2023లో మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటు వ్యవహారంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని 141వ అధికరణ కింద న్యాయవ్యవస్థకు ఉన్న అధికారాలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందా? లేదా నీరుగార్చనుందా? అనేది ఇక్కడ తేలాల్సిన అసలు సమస్య అని జస్టిస్‌ సూర్యకాంత్‌ నొక్కి చెప్పారు. ఈ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను వచ్చే ఫిబ్రవరి నెలలో విచారిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి త్వరలోనే పదవీవిరమణ చేస్తారని, కాబట్టి ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని త్రిసభ్య ధర్మాసనాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోరారు. దీనిపై జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ 2023లో చేసిన చట్టంపై విచారణ జరపడానికి కొంత సమయం అవసరమని చెబుతూ ఇది అంతిమంగా శాసన అధికారాలకు, న్యాయస్థానం అభిప్రాయానికి మధ్య నడుస్తున్న కేసు అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని 141వ అధికరణ కింద సుప్రీం కోర్టుకు వున్న అధికారాలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందా లేదా నీరు గారుస్తోందా అనేదే ఇక్కడ ప్రధానమైన సమస్య అని ఆయన పేర్కొన్నారు. 141వ అధికరణ కింద సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయాల (బైండింగ్‌ డెసిషన్స్‌)కు దేశంలోని అన్ని న్యాయస్థానాలు, అధికారిక సంస్థలు కట్టుబడి వుండాల్సి వుంటుంది. కోర్టు అభిప్రాయానికి, చట్టసభల అధికారాల అమలుకు మధ్యనే అసలు పరీక్ష లేదా సవాలు అనేది వుంటుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవరిస్తూ లేదా కొట్టివేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి పార్లమెంట్‌కు అధికారం వుందా లేదా అనే కీలకమైన అంశాన్ని పిటిషన్లు లేవనెత్తుతున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం పార్లమెంట్‌ తీర్మానించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన చట్టంలోని నిబంధనలకు లోబడి ఉండాలని రాజ్యాంగంలోని 324వ అధికరణ నిర్దేశిస్తోంది. అయితే అలాంటి చట్టమేదీ అమలులో లేదని పిటిషనర్లు గతంలో కోర్టు దృష్టికి తెచ్చారు. సిఇసి, ఇసిల నియామకం కోసం కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై 2023 మార్చిలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం రూలింగ్‌ ఇస్తూ ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సలహా మేరకు వారి నియామకాలు జరపాలని తెలిపింది. అయితే సిఇసి, ఇసిల నియామకాలు, సర్వీస్‌ నిబంధనలు, పదవీకాలానికి సంబంధించి మోడీ ప్రభుత్వం 2023లో పార్లమెంటులో ఓ చట్టాన్ని చేసింది. దీని ప్రకారం సిఇసి, ఇసిల నియామకాల కమిటీలో ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్‌ మంత్రి, ప్రతిపక్ష నేత లేదా లోక్‌సభలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు సభ్యులుగా ఉంటారు. ప్రధాన న్యాయమూర్తిని కమిటీ నుండి తప్పించారు.
నూతన చట్టాన్ని స్వచ్ఛంద సంస్థ అయిన అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌్‌), మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు జయ ఠాకూర్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే నూతన చట్టంపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. కాగా జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌తో కూడిన త్రిసభ్య బెంచ్‌ ముందు ప్రశాంత్‌ భూషణ్‌ బుధవారం వాదిస్తూ వచ్చే వారమే దీనిపై విచారణ జరపాలని కోరారు. ప్రస్తుత సిఇసి వచ్చే నెలలో పదవీవిరమణ చేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పదవీవిరమణ చేస్తారు. పిటిషనర్ల తరఫున హాజరైన మరో సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ తన వాదనలు వినిపిస్తూ 2023లో ఇచ్చిన తీర్పు ప్రాతిపదికను ప్రభుత్వం తొలగించలేదని, కేవలం కొత్త చట్టాన్ని మాత్రమే తీసుకొచ్చిందని తెలిపారు. కేసు విషయమై ఫిబ్రవరి 3వ తేదీన కోర్టుకు గుర్తు చేయాలని, నాలుగో తేదీన దీనిపై విచారణ జరిపేందుకు వీలు కలుగుతుందని జస్టిస్‌ కాంత్‌ సూచించారు.

➡️