ఏం జరగలే..

  • ప్రణయ్ రాయ్, రాధికారాయ్ లపై కేసును క్లోజ్‌ చేసిన సిబిఐ
  • ముగింపు నివేదికలో ఇద్దరికీ క్లీన్‌చిట్‌

న్యూఢిల్లీ : 2017లో అప్పటి ఎన్‌డిటివి డైరెక్టర్లు ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ లపై నమోదు చేసిన అవినీతి, ఫ్రాడ్‌ కేసును సిబిఐ తాజాగా మూసేసింది. 2008-2009లో ఐసిఐసిఐ బ్యాంకు అందించిన రూ.375 కోట్ల రుణం విషయంలో అవినీతి, కుట్ర, అవకతవకలున్నాయంటూ సిబిఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఐసిఐసిఐ బ్యాంకుకు ఉద్దేశపూర్వకంగా రూ.48 కోట్లకు పైగా నష్టానికి కారకులయ్యారని ప్రణయ్ రాయ్, రాధికారాయ్ లపై అభియోగాలు కూడా మోపింది. తాజాగా ఇద్దరిపై నమోదు చేసిన అన్ని అభియోగాల నుంచి వారికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన సిబిఐ ముగింపు నివేదికను ఒక వార్త సంస్థ సంపాదించింది. ఈ నివేదిక ప్రకారం ఈ కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర కానీ, ఏ ప్రభుత్వాధికారి లేదా ఐసిఐసిఐ బ్యాంకు ఆఫీసర్లు అధికారాన్ని దుర్వినియోగపర్చినట్టు కానీ లేదని సిబిఐ పేర్కొంది. ఐసిఐసిఐ, ఎన్‌డిటివి మధ్య లావాదేవీల్లో ఎలాంటి  అవకతవకలు, కుట్ర, అవినీతి, అధికార దుర్వినియోగం లేవనీ, అవన్నీ సాధారణ వ్యాపార లావాదేవీలేనని గుర్తించింది. వడ్డీ రేటు తగ్గింపు ఎన్‌డిటివి విషయంలోనే జరగలేదనీ, 2007 నుంచి 2010 మధ్య 83 రుణాల్లో జరిగిందని పేర్కొన్నది. బిబి రేటింగ్‌ కలిగి ఉన్న ఇతర కంపెనీలకు కూడా ఐసిఐసిఐ అలాంటి రుణాలను అందించిందని పేర్కొన్నది. 2008-09, 2009-10 ఆర్థిక సంవత్సరంలో బిబి, తక్కువ రేటింగ్‌ ఉన్న రుణ గ్రహీతలకు ఐసిఐసిఐ బ్యాంకు మొత్తంగా రూ.8400 కోట్ల లోన్లను అందించిందని సిబిఐ పేర్కొన్నది. రుణాల విషయంలో బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 19(2) ఉల్లంఘన జరగలేదని వివరించింది.

➡️