జనాభా లెక్కలు ఎందుకు దాటవేస్తున్నారు?

రాజ్యసభలో నిలదీసిన ప్రతిపక్షాలు
ఇప్పుడున్న 24 శాతం ప్రాతినిధ్యం దక్షిణాదికి తగ్గదంటారా? : జాన్‌ బ్రిట్టాస్‌
సమాధానాలు లేక ఎదురుదాడికి దిగిన అమిత్‌షా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జనాభా లెక్కలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాటవేస్తోందని ప్రతిపక్షాలు నిలదీశాయి. జనాభా లెక్కలు కూడా నిర్వహించలేని ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశాయి. జనాభా లెక్కలు దేశ ప్రజల స్థితిగతులకు ఒక ప్రామాణికమైన డేటా అని పేర్కొన్నారు. అలాంటి డేటాను నిర్వహించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాజ్యసభలో హోంమంత్రిత్వ శాఖ పనితీరుపై శుక్రవారం చర్చ సందర్భంగా జనాభా లెక్కలు లేకపోవడంపై వివిధ పార్టీల ఎంపిలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘జనాభా లెక్కింపు అన్ని డేటాలకు తల్లి’ అని ప్రతిపక్ష ఎంపిలు అన్నారు. ‘సమాజంలోని అనేక బలహీన వర్గాలు తమ ప్రయోజనాల కోసం జనాభా లెక్కలపై ఆధారపడతాయి’ అని పేర్కొన్నారు.

నియోజకవర్గాల పునర్విభజనపై సమాధానం ఇవ్వని హోంమంత్రి
నియోజకవర్గాల పునర్విభజన అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రస్తుత దామాషా ప్రాతినిధ్యంలో 24 శాతం కంటే తగ్గదని హామీ ఇస్తారా? అనే ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం ఇవ్వలేదు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ ఈ ప్రశ్నను లేవనెత్తారు. ‘నియోజకవర్గాన్ని తిరిగి విభజించినా, దక్షిణ భారతదేశం ఒక్కసీటు కూడా కోల్పోదని మీరు చెప్పారు. డీలిమిటేషన్‌ తరువాత, దక్షిణ భారతదేశానికి ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్యంలో ఎటువంటి తగ్గింపు ఉండదని మీరు హామీ ఇవ్వగలరా?’ అని జాన్‌ బ్రిట్టాస్‌ ప్రశ్నించారు. రెండు గంటలపాటు జరిగిన సమాధాన ప్రసంగంలో బ్రిట్టాస్‌ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానం ఇవ్వలేదు.

మూడు సూత్రాలపై దేశ ఐక్యత : సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌
ప్రజాస్వామ్య, సమాఖ్యవాదం, లౌకికవాదం వంటి మూడు సూత్రాలపై దేశ ఐక్యత ఆధారపడి ఉంటుందని సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ అన్నారు. చర్చలో సిపిఎం తరపున ఆయన మాట్లాడారు. దేశానికి చాలా బెదిరింపులు ఉన్నాయని, కానీ మనం చరిత్రలో జీవిస్తున్నామని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన అశాంతిని ప్రస్తావిస్తూ ‘ఈ దేశానికి అతిపెద్ద శత్రువు 300 సంవత్సరాల క్రితం మరణించిన ఔరంగజేబ్‌’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల హక్కులను హరించడం, ఢిల్లీలో ప్రతిదీ కేంద్రీకరించడం అనే పరిస్థితి ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం, లౌకికవాదానికి హానికరమని బ్రిట్టాస్‌ ఎత్తి చూపారు. కేరళ నుండి ఎనిమిది బిల్లులను, తమిళనాడు నుండి 11 బిల్లులను గవర్నర్లు అడ్డుకున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి ఆయా రాష్ట్రాల్లో పర్యటించి, స్వయంగా హామీ ఇచ్చినా… కేరళకు రావాల్సిన రూ.849 కోట్లు, తమిళనాడుకు రావాల్సిన రూ.2,152 కోట్లు పంపిణీ కాలేదని పేర్కొన్నారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్న కేంద్ర ప్రభుత్వం, ఉత్తర భారత రాష్ట్రాల్లో దక్షిణ భారత భాషలను బోధించడానికి సిద్ధంగా ఉందా? అని బ్రిట్టాస్‌ ప్రశ్నించారు. 300 సంవత్సరాల క్రితం మరణించి ఖననం చేయబడిన ఔరంగజేబును పునరుత్థానం చేయడం వెనుక ఉన్న రాజకీయాలపై బ్రిట్టాస్‌ నిలదీశారు. ‘ఎలోన్‌ మస్క్‌ ఎఐ ‘గ్రోక్‌’ కూడా ఈ చర్య రాజకీయ లబ్ధి కోసమే అని చెబుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో అమిత్‌ షా జోక్యం చేసుకుని బ్రిట్టాస్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. బ్రిట్టాస్‌ తన ప్రసంగాన్ని కొనసాగించి, ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు.

డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలేం చేస్తున్నాయి? : ఆప్‌
నేరాలను ఆపడం రాష్ట్రానికి సంబంధించిన అంశం, కానీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ బిజెపికి చెందినవని, కానీ నేరాలను ఎందుకు ఆపలేకపోతున్నారని ఆప్‌ ఎంపి సంజరు సింగ్‌ ప్రశ్నించారు. తాను ఉటంకిస్తున్న డేటా అంతా ఎన్‌సిఆర్‌బి నుండి వచ్చిందేనని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో నేరాలు ఎక్కువగా ఉన్నాయని చూపించే డేటాను ఉటంకిస్తూ అన్నారు. దీంతో అధికార పార్టీ ఎంపిలు ఆందోళనకు దిగారు. ‘ప్రపంచం అంతరిక్షానికి చేరుకుంది. దాని సాంకేతిక పురోగతిని మెరుగుపరుస్తోంది. కానీ మీరు సమాధులు తవ్వడంలో బిజీగా ఉన్నారు’ అంటూ బిజెపి ఎంపిల ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఔరంగజేబ్‌ సమాధి బద్దలు కొట్టాలనుకుంటే మీ పిల్లల్ని పంపండి : సంజయ్ రౌత్‌
శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్‌ మాట్లాడుతూ.. ‘హోంమంత్రిత్వ శాఖ అసమ్మతివాదులను బలహీనపరుస్తూ, రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, ప్రత్యర్థులను కొనుగోలు చేయడానికి పోలీసుల సహాయం తీసుకుంటుంటే, నిజమైన పని, అంటే శాంతి భద్రతలు, ఐక్యత వంటివి ఎవరు చేస్తారు? మణిపూర్‌ మండుతూనే ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర కూడా మండుతోంది’ అని ఆయన అన్నారు. ‘నాగ్‌పూర్‌ చరిత్రలో 300 సంవత్సరాలలో ఎప్పుడూ అల్లర్లు జరగలేదు. ఇప్పుడు నాగ్‌పూర్‌ వంటి నగరంలో… అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో అల్లర్లు జరుగుతున్నాయి. మీరు ఔరంగజేబు సమాధిని బద్దలు కొట్టాలనుకుంటే, దానిని బద్దలు కొట్టండి, మిమ్మల్ని ఆపిందెవరు? కేంద్రంలోనూ మహారాష్ట్రలోనూ మీ ప్రభుత్వమే’ అని ఆయన అన్నారు. దాని కోసం ‘మీ పిల్లలను పంపండి, మా పిల్లలను కాదు. కానీ మీ పిల్లలు విదేశాలలో చదువుతున్నారు. పనిచేస్తున్నారు. మీరు పేద పిల్లల మనసులను ఎందుకు ప్రభావితం చేస్తున్నారు’ అని ఆయన ప్రశ్నించారు.

అవినీతిని కప్పిపుచ్చడానికే భాషా సమస్యంటూ అమిత్‌ షా ఎదురుదాడి
డిసెంబర్‌ తరువాత వివిధ రాష్ట్రాల ప్రజలతో వారి మాతృభాషల్లోనే లేఖలు మార్పిడి చేసుకుంటానని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. కొంతమంది తమ అవినీతిని దాచడానికి భాషా సమస్యను లేవనెత్తుతున్నారని చెప్పారు. తమిళనాడులో ఎన్‌డిఎ అధికారంలోకి వస్తే తాము తమిళంలో వైద్య, ఇంజినీరింగ్‌ విద్యను అందుబాట్లోకి తీసుకొస్తామన్నారు. హిందీ అన్ని భారతీయ భాషలకు స్నేహితుడు, ఇతర భారతీయ భాషలను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. అంతర్గత భద్రత పటిష్టతకు కేంద్రప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, 2026 మార్చి 21 నాటికి దేశంలో పూర్తిగా నక్సలిజాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. నక్సలిజం రాజకీయ సమస్య మాత్రమేనని భావించే వారిని చూస్తే తనకు జాలి కలుగుతుందన్నారు. జమ్ముకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను కేంద్రం రద్దు చేసిన తరువాత ఉగ్రవాదంలో యువకుల ప్రమేయం దాదాపు కనుమరుగైందని చెప్పారు.

➡️