ముంబై : మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండేలు ఇరువురి చుట్టూనే బిజెపి అధిష్టానం తిరుగుతోంది. హస్తినలో చర్చలు జరుపుతూ తర్జనభర్జనలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వచ్చి ఇన్ని రోజులవుతున్నా.. మోడీ, అమిత్ షాలు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకింకా ఎంపిక చేయడం లేదంటూ శివసేన (యుబిటి) ఎంపి సంజరురౌత్ ప్రశ్నించారు.
ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండేపై కూడా సంజరు రౌత్ మండిపడ్డారు. శివసేన పేరుతో ఏక్‌నాథ్ షిండే.. బాలాసాహెబ్ పేరును రాజకీయాలకు వాడుకుంటున్నారు. అయితే షిండే పార్టీని ఏర్పాటు చేసినా.. ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఆయన తీసుకోవడం లేదు. అంతా ఢిల్లీలోనే జరుగుతున్నాయి. బాలాసాహెబ్ పేరుతో నిర్ణయాలు జరగాల్సింది ఢిల్లీలో కాదు.. ముంబైలో అని అన్నారు.
బాలాసాహెబ్ థాకరే ఎన్నడూ బీజేపీ నేతలను కలవడం కోసం ఢిల్లీకి వెళ్లలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ లాంటి నేతలే ఆయనను కలిసేందుకు ముంబైకి వచ్చేవారని సంజరురౌత్ చెప్పారు. అసలైన శివసైనికులుగా తామెన్నడూ ఢిల్లీకి వెళ్లి వాళ్లను (బీజేపీ నేతలను) భిక్షమడగలేదని ఎద్దేవా చేశారు.