పార్టీ జెండాలను ఎందుకు ప్రదర్శించలేదు : పినరయి విజయన్‌

తిరువనంతపురం  :    రాహుల్‌ గాంధీ రోడ్‌షోలో కాంగ్రెస్‌ జెండాలను ఎందుకు ప్రదర్శించలేదని .. ఆ పార్టీ బిజెపికి భయపడిందా అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తన జెండాను ప్రదర్శించడానికి కూడా భయపడే స్థితికి దిగజారిందా అని పినరయి విజయన్‌   ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొచ్చిలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయన్‌ ప్రశ్నించారు. మూడు రంగుల జెండాను వదులుకోవాలన్న సంఘ్  పరివార్‌ డిమాండ్‌ను అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. బుధవారం వయనాడ్‌లో నామినేషన్‌ పత్రాల దాఖలుకు ముందు రాహుల్‌ గాంధీ రోడ్‌ షో నిర్వహించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ రోడ్‌షోలో కాంగ్రెస్‌, యుడిఎఫ్‌ మిత్రపక్షమైన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయుఎంఎల్‌) జెండాలు కనిపించకపోవడంపై ఆయన స్పందించారు. రోడ్‌షోలో ఐయుఎంఎల్‌ జెండాను ప్రదర్శించకపోవడం ఆ పార్టీ పిరికితన కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఐయుఎంఎల్‌ ఓట్లు కావాలి కానీ ఆ పార్టీ జెండాలు అవసరం లేదా అని అన్నారు. మూడు రంగుల జెండా కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల ప్రముఖ చరిత్రను కాంగ్రెస్‌ మర్చిపోయిందని అన్నారు. మూడు రంగుల జెండా ప్రజల గొంతుకకు నిదర్శమని అన్నారు.

వేల కోట్ల రూపాయల కరువనూరు సహకార బ్యాంకు కుంభకోణంలో మరింత మంది సిపిఎం నేతలను ఇరికించే యోచనలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) వుందని మండిపడ్డారు. ఇడి ఆరోపించినట్లుగా పార్టీకి బ్యాంకులో రహస్య ఖాతా లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ నల్లధనాన్ని తీసుకోదని, దీంతో తమకు రహస్య ఖాతాల అవసరం లేదని అన్నారు. ప్రజల నుండి పార్టీ అందుకున్న విరాళాలను ఆడిట్‌ చేసి ఆదాయపన్ను శాఖకు అందిస్తామని అన్నారు.

➡️