Pinarayi Vijayan : ఓ ముస్లిం ఇచ్చిన ‘భారత్‌ మాతా కీ జై’ నినాదం వదిలేసుకుంటారా?

సంఘ పరివార్‌ను సూటిగా ప్రశ్నించిన పినరయి విజయన్‌

తిరువనంతపురం : ‘భారత్‌ మాతా కీ జై’, ‘జై హింద్‌’ నినాదాలు మొదటగా చేసింది ఇద్దరు ముస్లింలని, ఇప్పుడు ఆ నినాదాలను సంఘ పరివార్‌ వదిలేస్తుందా అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రశ్నించారు. ఉత్తర కేరళ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం పాలకులు, సాంస్కృతిక ప్రముఖులు, అధికారులు గణనీయ పాత్ర పోషించారన్నారు. ఇందుకు సంబంధించి చరిత్రలో అనేక ఉదాహరణలున్నాయని అన్నారు. అజిముల్లా ఖాన్‌ అనే ముస్లిం తొలుత భారత్‌ మాతా కీ జై అనే నినాదాన్ని ఇచ్చారని ఆయన అన్నారు. ”ఇక్కడకు వచ్చిన సంఘ పరివార్‌ నేతలు తమ ముందు కూర్చున్నవారిని చూసి భారత్‌ మాతా కీ జై అని నినదించమంటున్నారు. అసలు ఎవరు ఈ నినాదం ఇచ్చారు? ఈ నినాదం మొదట చేసింది ముస్లిం అని, ఆ వ్యక్తి పేరు అజిముల్లా ఖాన్‌ అని సంఘ పరివార్‌కు తెలుసో లేదో నాకు తెలియదు.” అని విజయన్‌ వ్యాఖ్యానించారు. ముస్లిం అని తెలిస్తే వారు ఈ నినాదం చేయడం ఆపేస్తారేమోనని వ్యంగ్యంగా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) వ్యతిరేకిస్తూ సిపిఎం నిర్వహిస్తున్న ర్యాలీల్లో నాల్గవది సోమవారం నాడిక్కడ జరిగింది. ఈ ర్యాలీ నుద్దేశించి ముఖ్యమంత్రి విజయన్‌ మాట్లాడుతూ, ‘జై హింద్‌’ అన్న నినాదాన్ని మొట్టమొదట ఇచ్చింది అబిద్‌ హసన్‌ అనే ప్రముఖ దౌత్యవేత్త అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మొఘల్‌ పాలకుడు షాజహాన్‌ కుమారుడు దారా షికాహ్ 50 ఉపనిషత్తులను సంస్కృతంలో నుండి పర్షియన్‌ భాషలోకి అనువాదం చేశారని, ప్రపంచవ్యాప్తంగా వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారని విజయన్‌ పేర్కొన్నారు. ముస్లింలు భారత్‌ నుండి పాకిస్తాన్‌కు వెళ్ళిపోవాలని వాదిస్తున్న సంఘ పరివార్‌ నేతలు, కార్యకర్తలందరూ ఈ చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకోవాలన్నారు. ఇతరులందరితో కలిసి ముస్లింలు కూడా ఈ దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని విజయన్‌ గుర్తు చేశారు.

➡️