సభ సజావుగా సాగేనా?

Dec 1,2024 07:25 #go smoothly, #meeting, #Parlament
  • పార్లమెంటులో నాలుగు రోజులు వాయిదా పర్వమే

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఎలాంటి చర్చలూ లేకుండానే వాయిదాలతో ముగుస్తున్నాయి. అదానీ ముడుపుల వ్యవహారం, మణిపూర్‌లో హింస, రాజ్యాంగ పరిరక్షణ తదితర అంశాలపై చర్చకు కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్‌ చేస్తుంటే అందుకు మోడీ సర్కార్‌ సిద్ధపడటం లేదు. దీంతో ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నెల 25న పార్లమెంటు సమావేశాలు మొదలైనప్పటి నుంచీ నాలుగు రోజుల పాటు ఇదే తీరు కొనసాగింది. రాజ్యాంగంతో పాటు అదానీ లంచం, ముడుపుల వ్యవహారం, యూపీలోని సంభాల్‌ హింస, మణిపూర్‌ అల్లర్లపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కేంద్రం మాత్రం అందుకు ససేమిరా అంటున్నది. దీంతో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ఇటు లోక్‌సభ స్పీకర్‌, అటు రాజ్యసభ చైర్మెన్‌లు సభలను వాయిదా వేస్తున్న పరిస్థితులు పార్లమెంటు సమావేశాల్లో కనబడ్డాయి. ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలికి, సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్రం, ప్రతిపక్షాలు కలిసి చర్చించే అవకాశం ఉన్నదని విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా, రాజ్యాంగంపై రెండు రోజుల చర్చ కోసం ప్రతిపక్షం పట్టుబడుతున్నది. ఒకవేళ దీనిపై ఇరు పక్షాలూ ఏకాభిప్రాయానికి వస్తే.. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బ్యాంకింగ్‌ చట్టాలు, రైల్వే చట్టం వంటి బిల్లులు, వాటిపై చర్చ, ఆమోదం తొలుత జరగాలని ఒకపక్క కేంద్రం ప్రతిపాదిస్తున్నదనీ, అయితే వాటి కంటే ముందు రాజ్యాంగంపై చర్చ జరగాలని కాంగ్రెస్‌ కోరుకుంటున్నదని సంబంధిత విశ్లేషకులు చెబుతున్నారు. సభ సజావుగా జరగాలని కేంద్రం కోరుకుంటే.. తమ డిమాండ్‌కు ప్రభుత్వం ఆమోదిస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయని తెలిపాయి. ఇందులో భాగంగా, ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ కె.సి వేణుగోపాల్‌, లోక్‌సభలో చీఫ్‌ విప్‌ కొడికున్నిల్‌ సురేశ్‌లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఆయన ఛాంబర్‌లో కలిసి, చర్చించినట్టు తెలిసింది. బిజెపి అధ్యక్షులు, రాజ్యసభ ఎంపి జెపి నడ్డా సైతం ఈ సమావేశంలో ఉన్నట్టు సమాచారం. రాజ్యసభ బిఎసి సమావేశంలో భాగంగా, రాజ్యాంగంపై రెండు రోజుల చర్చ జరపాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోవటానికి నడ్డా సమ్మతి తెలిపినట్టు సమాచారం. ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులైన రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గేలు.. రాజ్యాంగంపై రెండు రోజుల చర్చ నిర్వహించాలని స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మెన్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌కు లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే.

➡️