25 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఈ నెల 25 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇవి డిసెంబర్‌ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్రపతి ఆమోదించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్‌ 26న (రాజ్యాంగ దినోత్సవం) పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో పలు కీలక అంశాలపై లోకసభ, రాజ్యసభ సభ్యులు చర్చించనున్నారు. అలాగే, పలు బిల్లులను సైతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ సమావేశాల్లో వక్ఫ్‌ సవరణ బిల్లుపై జెపిసి నివేదిక పార్లమెంట్‌ ముందుకు రానుంది. అనంతరం బిల్లును సభలో ప్రవేశపెడతారు. అలాగే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు కూడా తీసుకురావడానికి ప్రభుత్వం యోచిస్తోంది. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా తీర్మానం కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
18వ లోక్‌సభ తొలి వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 9 వరకు జరిగాయి. మొత్తం సెషన్‌లో మొత్తం 15 సమావేశాలు జరిగాయి. ఇది సుమారు 115 గంటల పాటు సభ నిర్వహణ జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-2025 కేంద్ర బడ్జెట్‌ను జులై 23న సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 27.19 గంటలపాటు జరిగిన చర్చలో 181 మంది సభ్యులు పాల్గొన్నారు. సెషన్‌లో మొత్తం 65 ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులను కూడా ప్రవేశపెట్టారు.

➡️