కేంద్రాన్ని కోరిన మాజీ ప్రభుత్వోద్యోగులు
న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టానికి ప్రతిపాదించిన సవరణలను ఉపసంహరించుకోవాలని మాజీ ప్రభుత్వోద్యోగులు, దౌత్యవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2023వ సంవత్సరపు డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టంలోని సెక్షన్ 44 (3) ద్వారా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(జే)ని సవరించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రభుత్వోద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని ఇది అనుమతించదు. దీనిపై తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ మాజీ ప్రభుత్వోద్యోగులు, దౌత్యవేత్తలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖలు రాశారు. ఈ సవరణ సమాచార హక్కు చట్టం చేతులు కట్టేస్తుందని వారు అందులో ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ‘వ్యక్తిగత సమాచారం’ అంటే ఏమిటో అందులో నిర్వచించలేదని తెలియజేశారు. సమాచార హక్కు చట్టం ఏ పారదర్శకత, జవాబుదారీతనం కోసం రూపొందించబడిందో వాటికి ప్రతిపాదిత మార్పులు తూట్లు పొడుస్తున్నాయని విమర్శకులు ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) ద్వారా సమాచార హక్కు చట్టం రూపుదిద్దుకున్నదని, అది భావ ప్రకటనా స్వేచ్ఛకు గ్యారంటీ ఇస్తోందని వారు తెలిపారు.