ఈనెల 24న తిరుపతి నగర ఆవిర్భావ వేడుకలు : టీటీడీ చైర్మన్‌

తిరుపతి : తిరుపతి ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి నగరం ఆవిర్భవించిందని తెలిపారు.

భగవద్‌ రామానుజాచార్యులు తిరుపతిలో ఆ రోజున గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించి, కైంకర్య నిర్వహణ కార్యక్రమాలు రూపొందించి, నాలుగు మాడవీధుల నిర్మాణం ప్రారంభించారని వివరించారు. తొలుత ‘ గోవిందరాజ పట్టణం’గా, తరువాత ‘రామానుజపురం’ గా పిలిచేవారని, 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతిగా పిలుస్తున్నారని చెప్పారు.

తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి ఉదయం 8 గంటలకు ఊరేగింపు ప్రారంభమవుతుందని తెలిపారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత,నృత్య కళాశాల సహకారంతో విభిన్న కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేవతామూర్తులతోపాటు రామానుజాచార్యుల వేషధారణ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️