ఉచితంగా 2 వేల ఆన్‌లైన్‌ కోర్సులు

Feb 14,2024 08:06 #minister bostha, #speech

– 40 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

– మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-విజయనగరం :ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలోనే ఆన్‌లైన్‌ విధానంలో పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రపంచంలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకొని, ఎడెక్స్‌ కార్యక్రమం ద్వారా సుమారు రెండు వేల ఆన్‌లైన్‌ కోర్సులను రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. విజయనగరంలోని జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3.25 కోట్లతో నిర్మించిన బాలికల హాస్టల్‌ భవనాన్ని, ఒక్కొక్కటి రూ.1.25 కోట్లతో నిర్మించిన సివిల్‌, మెటలర్జీ లేబరేటరీ భవనాలను ప్రారంభించారు. సుమారు రూ.3.80 కోట్లతో నిర్మించనున్న వైస్‌ ఛాన్సలర్‌ లాంజ్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో విశ్వవిద్యాలయ మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ త్వరలో తీసుకొచ్చే ఆన్‌లైన్‌ కోర్సు ఫీజులను సైతం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 40 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఇంటర్న్‌షిప్‌ కాలంలో విద్యార్థులకు స్టైఫండ్‌ కూడా వస్తుందన్నారు. ఈ రెండు కార్యక్రమాలను ఈ నెల 16న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. విద్యాసంస్థల్లో పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించడంతోపాటు, అవసరమైన ఉపాధ్యాయులు, అధ్యాపకులను కూడా నియమిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే సుమారు 2,200 ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అధ్యాపకుల ఖాళీల భర్తీ చేపట్టామన్నారు. జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచస్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ నాగలక్ష్మి, జెఎన్‌టియుజివి వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.వెంకటసుబ్బయ్య, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జయసుమ, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.శ్రీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️