ఉద్యోగ భద్రత కల్పించండి

Mar 1,2024 08:25 #Dharna, #mother tongue teachers

– ఆదివాసీ మాతృభాష ఉపాధ్యాయుల నిరసన దీక్ష

ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ మాతృభాష ఉపాధ్యాయులు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఎ ఎదుట గురువారం నిరసన దీక్షలు చేపట్టారు. మాతృభాష ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ దీక్షలను ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ ప్రారంభించి మాట్లాడారు. మాతృభాష ఉపాధ్యాయులను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలకు రెన్యువల్‌ చేసి, 2024-25 విద్యా సంవత్సరంలో యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఏడాదీ గిరిజన ప్రాంతంలోని పాఠశాలలకు సరిపడా బడ్జెట్‌ కేటాయింపులు చేయాలని, టైమ్‌ స్కేల్‌ వేతనం రూ.32 వేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దీక్షలు ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగుతాయని, అప్పటికీ ప్రభుత్వం, ఐటిడిఎ స్పందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాతృభాష ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండబాబు, చిన్నమ్మి, కృష్ణ, నూకరాజు, సత్యవతి పాల్గొన్నారు.

➡️