ఒపిఎస్‌ సాధించి తీరుతాం

Feb 12,2024 08:12 #swarnothsavam, #utf

– పోరాటాలకు పుట్టినిల్లు యుటిఎఫ్‌ : నక్కా వెంకటేశ్వర్లు

– ఘనంగా యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాలు ప్రారంభం

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌ :యాబై ఏళ్ల చరిత్ర కలిగిన యుటిఎఫ్‌ పోరాటాలకు పుట్టినిళ్లని, ఉద్యమాలతో ప్రభుత్వం మెడలు వంచి ఉపాధ్యాయుల ప్రతి హక్కులను కాపాడి, ఒపిఎస్‌ను సాధించుకుంటామని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కర్నూలు సిల్వర్‌ జూబిలీ కళాశాలలో ఆదివారం యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ నగారా, డప్పుల కొట్టి సంబరాలను ప్రారంభించారు. ముందుగా యుటిఎఫ్‌ పతాకాన్ని రాష్ట్ర సహాధ్యక్షులు కందుకూరి సురేష్‌ కుమార్‌, ఎస్‌టిఎఫ్‌ఐ పతాకాన్ని నక్కా వెంకటేశ్వర్లు ఆవిష్కరించి, అక్కడ ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ లోగోను నాయకులు ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు యుఆర్‌ఎ రవికుమార్‌ వ్యవహరించారు. ఈ సందర్భంగా నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యుటిఎఫ్‌ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు. పాత పెన్షన్‌ విధానం సాధించి తీరుతామని, సిపిఎస్‌ రద్దయ్యేవరకు పోరాటం దశల వారీగా చేస్తామని చెప్పారు. యుటిఎఫ్‌ జిల్లా తొలి ప్రధాన కార్యదర్శి, రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి పుల్లయ్య మాట్లాడుతూ అంకితత్వం, ఉద్యమ స్ఫూర్తి ఒక్క యుటిఎఫ్‌కే సాధ్యమన్నారు. పోరాటాలతోనే ఉపాధ్యాయుల ప్రయోజనాలు సాధించుకుంటామని తెలిపారు. ప్రతీ కార్యకర్త యుటిఎఫ్‌ కుటుంబ సభ్యుడన్న విషయాన్ని నాయకత్వం మరచిపోదని, ఆనాటి నుండి ఈనాటి వరకు అదే ఒరవడి కొనసాగుతోందని తెలిపారు. సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ సంబరాలు ఏడాదంతా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయన్నారు. యుటిఎఫ్‌ మాజీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ అనేక ఉద్యమాలు నిర్మించి ఉద్యోగ ప్రయోజనాలు సాధించి పెట్టిన ఘనచరిత్ర కలిగిన సంఘమైన యుటిఎఫ్‌ కోసం చివరి శ్వాస వరకు శ్రమిస్తానన్నారు. కోడుమూరు మాజీ ఎంఇఒ నాగభూషణం శెట్టి యుటిఎఫ్‌ సుదీర్ఘ ఉద్యమ చరిత్రను పద్యంలో వివరించారు. కెంగార మోహన్‌ రచించిన యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాల గేయాన్ని ప్రజా నాట్యమండలి సీనియర్‌ నాయకులు ఎంపి బసవరాజు సభలో ఆలపించారు. గతంలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌పాటి స్వాగతం పలుకగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు నాగమణి, జయరాజు, ఎల్లప్ప, నంద్యాల జిల్లా కార్యదర్శి సుధాకర్‌, సిఐటియు నాయకులు రామాంజనేయులు, జెవివి నాయకులు సుధీర్‌ రాజు , జిల్లా ఆర్థిక కార్యదర్శి యెహోషువా సందేశం ఇచ్చారు.

➡️