కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలి

Feb 14,2024 08:08 #asa, #prakatana

– 14, 15, 16 తేదీల్లో ఐటిడిఎల వద్ద దీక్షలు

– 19న ఐటిడిఎల ముట్టడి

– ఎపి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌యూనియన్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గిరిజన ప్రాంతాల్లో 2,361 మంది కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఎపి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె పోశమ్మ, కె ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఐటిడిఎల వద్ద జరిగే సామూహిక దీక్షలు, 19న ఐటిడిఎల ముట్టడి నిర్వహించనున్నట్లు తెలిపారు. 20 నుంచి 25 వరకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి వద్దకు సామూహిక రాయభారాల కార్యక్రమాల్లో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు మద్దతు తెలపాలని, కలెక్టర్లు, డిఎమ్‌హెచ్‌ఒలకు వినతిపత్రాలు అందజేయాలని యూనియన్‌ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని ఐదు ఐటిడిఎ ప్రాజెక్టులైన సీతంపేట, పార్వతీపురం, పాడేరు, కెఆర్‌ పురం, శ్రీశైలంలలో పనిచేస్తున్న 2,361 మంది కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను 2017లో ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ ద్వారా నియామకం చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌, ఆశా వర్కర్స్‌ ఒకే రకమైన పని చేస్తున్నప్పటికీ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు మాత్రం కేవలం రూ.4 వేలు చెల్లిస్తున్నారని తెలిపారు. యూనిఫామ్‌, రికార్డ్సు, మెడికల్‌ కిట్స్‌, టిఎ, డిఎలు ఇవ్వడం లేదని, ఏజెన్సీ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌, ఆశా వర్కర్స్‌ గిరిజన ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో పేదలకు ఆరోగ్యసేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా జోలె కట్టుకుని కుటుంబ సభ్యులతో ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారని, గిరిజన ప్రాంతాల్లో వైద్యారోగ్య సేవలను మెరుగుపరచాలని ఎపి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ పేర్కొంది. ప్రభుత్వం తక్షణమే కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌కు ఆశాలతో సమానంగా వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, ప్రయాణపు ఖర్చులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో చనిపోయిన ఆశాలకు రూ.10 లక్షలు ఎక్స్‌్‌గ్రేషియో ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఆశా ఉద్యోగం ఇవ్వాలని, రూ.10 లక్షల గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని పోశమ్మ, ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు.

➡️