సచివాలయాల్లో బదిలీలకు ఓకే

– పాత జిల్లాల యూనిట్‌ ప్రకారమే రేషనలైజేషన్‌

– స్పౌస్‌ కోటాలో అంతర్‌ జిల్లాల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం మరోసారి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జిఓ ఎంఎస్‌ నెంబరు 1001ని శుక్రవారం విడుదల చేసింది. పాత జిల్లాల యూనిట్‌ ప్రకారమే రేషనలైజేషన్‌ ప్రకియ ఉంటుందని అందులో స్పష్టం చేసింది. స్పౌస్‌ కేటగిరిలో భార్య, భర్తలకు జిల్లా/అంతర్‌ జిల్లాల బదిలీలు చేయొచ్చని కూడా జిఓలో పేర్కొంది. జిల్లాల్లో అవసరమైన పోస్టులకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తెలిపింది. ఎనిమిది మంది కంటే ఎక్కువ సచివాలయ ఉద్యోగులు ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎనిమిది మంది కంటే తక్కువ ఉన్న సచివాలయాలకు సిబ్బందిని బదిలీలు చేయనున్నారు. బదిలీల ప్రక్రియలో హోదాల ప్రాధాన్యతా క్రమంలో నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే మొదటి ప్రాధాన్యతగా సంక్షేమం, విద్య అసిస్టెంట్‌/వార్డు సంక్షేమం అభివృద్ధి కార్యదర్శి (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డిఎస్‌), రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్‌ (జిఎంఎస్‌కె)), మూడో ప్రాధాన్యతగా డిజిటల్‌ అసిస్టెంట్లు, నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌, పట్టణాల్లో ప్రాధాన్యత వార్డు సంక్షేమం, అభివృద్ధి కార్యదర్శి, రెండో ప్రాధాన్యతగా వార్డు మహిళలు, బలహీనుల విభాగం రక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్‌), మూడో ప్రాధాన్యతగా వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శులుగా ప్రాధాన్యతల వారీ బదిలీల ప్రక్రియ ఉండనుంది.

➡️