జెఎసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం- యుటిఎఫ్‌

Feb 26,2024 08:16 #press meet, #utf

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎపి జెఎసి చలో విజయవాడ పిలుపును వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యుటిఎఫ్‌ వెల్లడించింది. జెఎసి ప్రకటించిన నిర్ణయంపై ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం చర్చించింది. విజయవాడలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడారు. లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకనుగుణంగా నిలబడి పోరాటం చేయాల్సిన ఎపి జెఎసి.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత సాధించకుండానే ఈ నెల 27వ తేదీన చేపట్టనున్న ‘చలో విజయవాడ’ను వాయిదా వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ తదితర ఆర్థిక బకాయిలు రూ.20 వేల కోట్లపై ప్రభుత్వం ఏ విధమైన స్పష్టత ఇవ్వకుండా మినిట్స్‌ జారీ చేసిందని తెలిపారు. 11వ పిఆర్‌సి బకాయిలు చెల్లింపుపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. మధ్యంతర భృతి ఇవ్వకుండా పిఆర్‌సి అమలు చేస్తామని చెప్పడం బూటకమని విమర్శించారు. 2004 సెప్టెంబరు కంటే ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారం పాత పెన్షన్‌ అమలు చేయకుండా దాటవేస్తున్నారని పేర్కొన్నారు. పది వేల మంది కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పిన మాట నీటిమూటగా మారిపోయిందని విమర్శించారు. ఇలా ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. ఉద్యమం చేయాల్సిన సమయంలో ఇలా అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్‌ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, సహాధ్యక్షులు కె సురేష్‌కుమార్‌, ఎఎన్‌ కుసుమకుమారి, కోశాధికారి బి గోపిమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️