డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు.. తప్పుల సవరణకు ఛాన్స్‌

Feb 21,2024 15:47 #DSC Notification, #time extended

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (ఎపి డిఎస్‌సి -2024) పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం బుధవారంతో దరఖాస్తు ఫీజు చెల్లింపు సమయం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఫిబ్రవరి 25 రాత్రి 12గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లింపుతో పాటు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటివరకు టెట్‌కు 3,17,950 మంది, డీఎస్సీకి 3,19,176 మంది దరఖాస్తులు చేసుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. హెల్ప్‌ డెస్క్‌ సమయాలను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పొడిగించినట్లు పేర్కొంది.

దరఖాస్తుల్లో ఎడిట్‌ ఆప్షన్‌కు అవకాశం

అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు చేసే సమయంలో తప్పుల్ని సవరించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అప్లికేషన్‌ను ఎడిట్‌ చేసుకొని మళ్లీ సమర్పించుకొనే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ఎడిట్‌ ఆప్షన్‌కు పాటించాల్సిన సూచనలివే..

  • తొలుత అభ్యర్థులు వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in లో డిలీట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • అభ్యర్థి పాత జర్నల్‌ నంబర్‌తో, అభ్యర్థి మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేసి డిలీట్‌ ఆప్షన్‌ను పొందవచ్చు. తద్వారా ఎలాంటి రుసుం చెల్లించకుండా తప్పులు సరిదిద్ది అప్లపికేషన్‌ను మళ్లీ సమర్పించుకోవచ్చు.
  • అభ్యర్థి పేరు, తాను ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్‌ మిస్టేక్‌ మార్చుకోవాలంటే పరీక్ష కేంద్రంలో నామినల్స్‌ రోల్స్‌లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చు.

రాష్ట్రంలో మొత్తం 6,100 పోస్టులకు డీఎస్సీ పరీక్ష కోసం ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 2న తుది కీ విడుదల చేసి ఏప్రిల్‌ 7న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఏపీ టెట్‌ పరీక్ష ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వరకు జరగనుంది. టెట్‌ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు, పక్కనున్న రాష్ట్రాల్లోనూ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించగా, డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే సమయంలో అలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు. కేవలం అభ్యర్థి ప్రాథమిక విద్యను అభ్యసించిన జిల్లా వివరాలు మాత్రమే అడిగారు. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉండి, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ దరఖాస్తు సమయం ముగిసిన తర్వాత పరీక్షా కేంద్రాలను ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తారా? లేక స్థానికత ఆధారంగా సొంత జిల్లాలో రాయాల్సి ఉంటుందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

➡️