నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి

Feb 10,2024 21:35 #balostavalu

– గోదావరి బాలోత్సవం ప్రారంభ సభలో జెసి తేజ్‌భరత్‌

– విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి : ఎమ్మెల్సీ ఐవి

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి:చారిత్రక రాజమహేంద్రవరంలో జరుగుతున్న గోదావరి బాలోత్సవంలో విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాలలో రెండు రోజులపాటు జరిగే గోదావరి బాలోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. తొలుత దామెర్ల రామారావు, ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి చిత్రపటాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలోత్సవం అసోసియేట్‌ అధ్యక్షులు విఎస్‌ఎస్‌.కఅష్ణకుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో జెసి మాట్లాడారు. పిల్లల్లో దాగియున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) మాట్లాడుతూ పిల్లలు విద్యతోపాటు, క్రీడలు, సాంస్కృతిక రంగంలోనూ రాణించాలన్నారు. పిల్లల్లో దాగియున్న ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న గోదావరి బాలోత్సవంలో విద్యార్థుల తల్లీదండ్రులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కొత్తగూడెం చిల్డ్రన్‌ క్లబ్‌ అధ్యక్షులు వాసిరెడ్డి రమేష్‌బాబు, తిరుమల విద్యా సంస్థల అధినేత, గోదావరి బాలోత్సవం అధ్యక్షులు నున్నా తిరుమలరావు, అమరావతి బాలోత్సవం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ, డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు అరుణకుమారి, గోదావరి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఎన్‌.రాజు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పి.తులసి పాల్గొన్నారు.

➡️