పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.120 కోట్ల దోపిడీ -టిడిపి నేత పట్టాభి

Feb 11,2024 20:38 #pattabhiram, #press meet, #TDP leaders

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.120 కోట్ల దోపిడీ జరిగిందని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. పేపర్‌ ధర భారీగా తగ్గిన పరిస్థితుల్లో కూడా ఒక్కో పేజి ముద్రణకు రూ.34.2 పైసల ధర నిర్ణయించారని ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్రభుత్వమే పేపర్‌ను కొనుగోలు చేసి పాఠ్యపుస్తకాల ముద్రణకు ప్రింటర్స్‌కు అందించే విధానం ఉందని తెలిపారు. ఈ విధానాన్ని రద్దు చేసి పేపర్‌ కొనుగోలు కూడా బినామీ ప్రింటర్స్‌కు అప్పగించారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తికాని సంస్థలకు టెండర్‌లో పాల్గనేందుకు అవకాశం కల్పించి విద్యాశాఖ మంత్రి బత్స సత్యనారాయణ తన బినామీలకు తెరమీదకు తీసుకొస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లో మంత్రితోపాటు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, సిఎం కార్యదర్శి ధనుంజరు రెడ్డి కీలక భూమిక పోషించారని ఆరోపించారు. తమిళనాడు న్యూస్‌ ప్రింట్‌ అండ్‌ పేపర్‌ లిమిటెడ్‌ సంస్థకు చెల్లించాల్సిన రూ.200 కోట్లు బిల్లులు చెల్లించలేదని తెలిపారు. జమకాని ఆసరా 4వ విడత : ఆచంట సునీతముఖ్యమంత్రి ఆసరా 4వ విడత ఆసరా నిధుల చెల్లింపు బటన్‌ నొక్కి 20 రోజులవుతున్నా ఇప్పటికీ లబ్ధిదారుల ఖాతాల్లో జమకాలేదని తెలుగునాడు అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. గత నెల 23వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభలో సిఎం ప్రకటించారని తెలిపారు. కొన్ని చోట్ల గ్రూపులకు చెక్కులు కూడా పంచారని, డబ్బులు పడలేదని పేర్కొన్నారు. మహిళలందరికీ రుణమాఫీ కింద వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో పొదుపు సంఘాలకు లబ్ధి శూన్యమని విమర్శించారు. మరోవైపు డ్వాక్రా మహిళలను ఆసరా వారోత్సవాలకు, రాజకీయ సభలకు తరలివచ్చే ముడిసరుకుగా మార్చేశారని ఆరోపించారు.

➡️