ప్రజలను మభ్యపెడుతున్న బిజెపి, వైసిపి, టిడిపి

Feb 10,2024 21:45 #speech, #ys sharmila

– మూడు రాజధానుల పేరిట ఆర్భాటం

– చివరకు రాజధాని లేకుండా చేశారు : షర్మిల

ప్రజాశక్తి – చింతపల్లి, నర్సీపట్నం టౌన్‌ విలేకరులు :రాష్ట్ర ప్రజలను బిజెపి, వైసిపి, టిడిపిలు మభ్యపెడుతున్నాయని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల విమర్శించారు. అల్లూరి జిల్లా చింతపల్లిలోనూ, అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడి గ్రామంలోనూ శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో షర్మిల మాట్లాడుతూ.. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ఆర్భాటం చేసి చివరకు ఒక్క రాజధానీ కూడా లేకుండా చేశారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే 25 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తానని చెప్పి ఎన్నికలకు ముందు 6 వేల పోస్టులతో సరిపెట్టారన్నారు. మెగా డిఎస్‌సి పేరు చెప్పి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో నేటికీ ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నియంతల పాలనకు పాతరేయాలని ప్రజలను కోరారు. జగన్‌, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బిజెపి నేతల కాళ్లు మొక్కడానికి సమయం వెచ్చించడం సిగ్గుచేటన్నారు. ప్రజల పక్షాన లేనివారిని రానున్న ఎన్నికల్లో ఓడించాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని, ఎపికి ప్రత్యేక హోదా వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా చోట్ల జరిగిన సభల్లో మాజీ కేంద్ర మంత్రులు జెడి.శీలం, ఎం.పల్లంరాజు, మాజీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి పాల్గొన్నారు.

➡️