ప్రాధమిక హక్కులపై దాడిని తిప్పికొట్టండి -వాటి పరిరక్షణతోనే కార్మిక హక్కులు

Feb 10,2024 10:18 #MLC KS Lakshmana Rao, #speech

మెడికల్‌ రెెప్రజెంటేటివ్‌ల రాష్ట్రమహాసభ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రాధమిక హక్కులపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టడం ద్వారా రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలని మెడికల్‌ రెప్రజెంటేటివ్‌లకలు ఎంఎల్‌సి కె.ఎస్‌ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడలోని ఎంబివికెలో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రెప్రజెంటేటివ్స్‌ యూనియన్‌(ఎపిఎంఎస్‌ఆర్‌యు) 39వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 11వ తేదీ దాకా మూడు రోజులపాటు జరిగే ఈ మహాసభలను రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ కుమార్‌ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ మహాసభ ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులపై దాడి విపరీతంగా పెరిగిందన్నారు. ప్రాథమిక హక్కులు లేకుంటే కార్మికులకు ఎలాంటి హక్కులు వుండవని అన్నారు. ప్రాథమిక హక్కులు, భావప్రకటనా స్వేచ్చ లేకుంటే కార్మిక సంఘాలు హక్కులను కూడా సాధించుకోలేవని తెలిపారు. ఇప్పటికే కార్మిక హక్కులను పూర్తిగా రద్దుచేసి నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సమాఖ్య స్పూర్తిని పూర్తిగా ద్వంసం చేసేలా దేశాన్ని అధ్యక్షతరహాపాలన కిందికి తీసుకొచ్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రజలతో మమేకం అయి బలమైన ఉద్యమాలను నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా ఎపిఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ కుమార్‌ మాట్లాడుతూ దేశంలో కోవిడ్‌ ప్రజల ప్రాణాలతోపాటు మన హక్కులను కూడా తీసుకెళ్లిందని అన్నారు. కోవిడ్‌ వైద్యరంగంలో వున్న డొల్లతనాన్ని చాటిచెప్పిందని అన్నారు. క్యాన్సర్‌ పేషంట్‌ వాడే మందులపై 5శాతం జిఎస్‌టి వుంటే బంగారంపై మూడు శాతం వుందన్నారు. అలాగే పౌష్టికాహారంపై 20శాతం జిఎస్‌టి వుంటే వజ్రాల మీద ఒక శాతం మాత్రమే ఉందన్నారు. మందులు, వైద్యపరికరాలపై పెద్దఎత్తున జిఎస్‌టి వుందని, దేశంలో ఆరోగ్యవంతుల కంటే అనారోగ్యంగా వున్నవారే అధికపన్నులు కడుతున్నారని చెప్పారు. మందుల ధరలను నియంత్రించకుండా జనరిక్స్‌ పేరుతో కేంద్రం మోసం చేస్తోందని చెప్పారు. నియంత్రణలేక పోతే జనరిక్స్‌ మందుల ధరలు కూడా పెరిగిపోయే ప్రమాదం వుందన్నారు. మెడికల్‌ రెప్రజెంటేటివ్‌లు ప్రజాపోరాటాల్లో భాగస్వామ్యం అవుతున్నందునే రాష్ట్రంలో 50ఏళ్లుగా ఎపిఎంఎస్‌ఆర్‌యు పటిష్టంగా వుందన్నారు. . ఈ ప్రారంభసభలో ఎపిఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర ప్రధానకార్యదర్శి యువి కృష్ణయ్య, సీనియర్‌ నాయకులు రాజ్‌మోహన్‌, తెలంగాణా నాయకులు నాగేశ్వరరావు, కర్నాటక నాయకులు చంద్రకుమార్‌, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ఎఫ్‌ఎంఆర్‌ఐ జాతీయ ప్రధానకార్యదర్శి రమేష్‌ సుందర్‌, నాయకులు సునీల్‌కుమార్‌, సుబ్రాంషు, బెఫి రాష్ట్ర ప్రధానకార్యదర్శి అజరుకుమార్‌, సీమాంధ్ర కెమిస్ట్రి డ్రగ్స్‌ అసోషియేషన్‌ కోశాధికారి సాదు ప్రసాద్‌, సిఐటియు నాయకులు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️