బిజెపికి మద్దతునిచ్చే పార్టీలను ఓడించండి

Feb 14,2024 09:02 #Chalasani Srinivas, #press meet

– ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నాయకుల విజ్ఞప్తి

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :విభజన హామీలతో సహా, ఆంధ్రప్రదేశ్‌కు ఏ ఒక్క హామీని అమలు చేయని బిజెపికి ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా మద్దతు తెలిపే పార్టీలకు ఓటు వేయొద్దని ఎపి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ ప్రజలను కోరారు. ‘రాబోయే ఎన్నికల్లో కొన్ని పార్టీలు ఎత్తులు-జిత్తులు, ఆంధ్రప్రదేశ్‌ హక్కులు- విభజన హామీల అమలు ఎలా చేయించాలి, ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి- ఎవరికి ఓటు వేయాలి’ అనే అంశంపై మంగళవారం విశాఖలోని విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా అనేది భావితరాల సమస్య అని, దీని కోసం టిడిపి, వైసిపి నాయకులు కనీసం ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. తెలుగు జాతిలోని శౌర్యవంతుల పేరు మీద వ్యాక్సిన్లు కనిపెట్టాలని శాస్త్రవేత్తలను కోరుతున్నామని, అటువంటి వ్యాక్సిన్‌ వేస్తే మన నాయకులకు కనీసం ధైర్యమైన వస్తుందని ఎద్దేవా చేశారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే ప్రచారంలో రాష్ట్రంలోని పార్టీలు ఉన్నాయని, అవసరమైతే ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని 15వ ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎన్‌కె సింగ్‌ చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ..ఎపికి ప్రత్యేక హోదా పదేళ్లయినా ఉండాలని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి పది ఏళ్లు పాలించినా హోదా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు అందివ్వకుండా కాలయాపన చేస్తున్నారని, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఇంత ద్రోహం చేసిన బిజెపిని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్‌ జి.అప్పలనాయుడు, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ రమేష్‌, విభజన హామీల సాధన సమితి సహాయ కార్యదర్శి కనిశెట్టి సురేష్‌బాబు పాల్గొన్నారు.

➡️