ముగిసిన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు

Feb 11,2024 21:05 #chekumuki, #jvv science

– ప్రభుత్వ పాఠశాలల విభాగంలో విజేత కుప్పం జడ్‌పి స్కూల్‌

– ప్రయివేటు పాఠశాలల విభాగంలో కాకినాడ ఆదిత్య హైస్కూల్‌

ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) :పల్నాడు జిల్లా యడ్లపాడు మండల కేంద్రంలోని నారాయణ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో జనవిజ్ఞాన వేదిక (జెవివి) ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించిన 34వ రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి హాజరైన విద్యార్థులకు బహుముఖ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పరీక్షించారు. క్విజ్‌, ప్రాక్టికల్‌, ప్రయోగ, రాత, ఆలోచనాత్మక తదితర పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో విజేతగా చిత్తూరు కుప్పం జడ్‌పి పాఠశాల విద్యార్థులు నిలవగా, రెండో స్థానాన్ని సత్యసాయి జిల్లాకు చెందిన బిఎస్‌ఆర్‌ బార్సు ఎంపి స్కూల్‌ విద్యార్థులు, మూడో స్థానాన్ని అనకాపల్లి జిల్లా మాడుగుల జడ్‌పి పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు. వీరికి ధ్రువపత్రాలతోపాటు బహుమతులు, జ్ఞాపికలను కల్పతరువు సంస్థల డైరెక్టర్‌ ఎస్‌.సుబ్బారెడ్డి, కీర్తి డెవలపర్స్‌ సంస్థ అధినేత ముద్దుల వెంకట కోటయ్య, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ తరపున ఊటుకూరు శ్రీనివాసరావు, యడ్లపాడు నారాయణ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ ప్రిన్సిపల్‌ సృజన, డైరెక్టర్‌ పోపురి వెంకటేశ్వర్లు ప్రదానం చేశారు. ప్రయివేటు పాఠశాలల విభాగంలో మొదటి బహుమతిని కాకినాడకు చెందిన ఆదిత్య హెస్కూల్‌ విద్యార్థులు గెలుచుకోగా, రెండో బహుమతిని కర్నూలుకు చెందిన మాంటిస్సోరీ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, మూడో బహుమతిని ఏలూరుకు చెందిన కుమారి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు సాధించారు. సంబరాల్లో పాల్గన్న ప్రతి జట్టుకు జెవివి తరుపున ధ్రువపత్రం, జ్ఞాపికలను అందించారు. వీటిని జెవివి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, ప్రధాన కార్యదర్శి కె.రామారావు, కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీనివాస్‌, సి.హెచ్‌.జయప్రకాశ్‌, కెఎంఎంఆర్‌ ప్రసాద్‌, వైఎస్‌.నాగేశ్వర్‌, గోపాల్‌రావు, టి.సురేశ్‌, జెవివి పల్నాడుజిల్లా అధ్యక్షులు డి.బుజ్జిబాబు, చిలకలూరిపేట నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ప్రదానం చేశారు.

➡️