మెగా డిఎస్‌సి కోసం నిరుద్యోగుల ధర్నా

Feb 10,2024 08:06 #Dharna, #DYFI

ప్రజాశక్తి-పల్నాడు: జిల్లారాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల టీచర్‌ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్‌సి విడుదల చేయాలని, విద్యా రంగాన్ని బలోపేతం చేయాలనే డిమాండ్‌తో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్లి డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ ప్రతి ఏటా డిఎస్‌సి విడుదల చేస్తానని ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో 6,100 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల చేసి డిఎస్‌సి అభ్యర్థులను మోసం చేశారని మండిపడ్డారు. లక్షల సంఖ్యలో ఉన్న డిఎస్‌సి అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జిఒ 117ను వెంటనే రద్దు చేయాలని, మూసేసిన పాఠశాలలను పున:ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పోరాటాల ఫలితంగా రద్దయిన అప్రెంటిస్‌ విధానాన్ని మళ్లీ అమలు చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ధర్నాలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.సాయికుమార్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

➡️