రవాణా రంగం సమ్మెను విజయవంతం చేయాలి

Feb 10,2024 08:07 #CH Narsingrao, #speech

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు పిలుపు

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :రవాణా రంగం కార్మికు హక్కుల సాధన కోసం కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 16న దేశ వ్యాప్తంగా చేపట్టే రవాణా రంగం సమ్మెను విజయవంతం చేయాలని విశాఖ మోటారు ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ యూనియన్ల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కమిటీ సమావేశం శుక్రవారం సిఐటియు నాయకులు పి.రాజ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు పాల్గని మాట్లాడుతూ.. రవాణా రంగాన్ని, రోడ్లను నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌ కింద ప్రయివేటు వారికి ధారదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఓనర్‌ కమ్‌ డ్రెవర్లు లేకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే మోటారు ట్రాన్స్‌పోర్టు చట్టం, సెక్షన్‌ 106 (1, 2) పేరిట దాడులు చేస్తున్నారన్నారు. రవాణా రంగంలో డ్రైవర్లదే కీలకపాత్ర అని, వారికి ప్రభుత్వాలు ఏ విధమైన సహాయమూ అందించడం లేదని తెలిపారు. రవాణా రంగ కార్మికుల ద్వారా ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా వారి సంక్షేమానికి ఎటువంటి చట్టమూ లేకపోవడం శోచనీయమన్నారు. డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌లో పన్ను మినహాయింపు ఇవ్వాలని, రవాణా కార్మికులకు ఉరితాడు వంటి సెక్షన్‌ 106 (1, 2), మోటారు ట్రాన్స్‌పోర్టు సవరణ చట్టం 2019, జిఒ నెంబరు 21లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️