రామవరంలో ఉద్రిక్తత

Mar 2,2024 08:01 #arrested, #ex mla

– అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు

– అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్టు, విడుదల

ప్రజాశక్తి – బిక్కవోలు(తూర్పు గోదావరి):అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు ప్రతిసవాళ్లతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఉద్రిక్తత నెలకొంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి దంపతులు రూ.500 కోట్ల అవినీతి చేశారని, దీన్ని మార్చి ఒకటో తేదీన అనపర్తిలోని మీ హాస్పటల్‌ వద్దకే వచ్చి నిరూపిస్తానని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి గత నెల 27న సవాల్‌ చేశారు. బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రతిసవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి శుక్రవారం తన స్వగ్రామం రామవరం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బహిరంగ చర్చా వేదిక వద్దకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే అక్కడికి టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు రామకృష్ణారెడ్డిని ఇంటి వద్దే అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామకృష్ణారెడ్డికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆయనను అరెస్టు చేశారు. కొవ్వూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నామని చెప్పి పోలీసు వాహనంలోనే ఆయన్ని తిప్పుతూ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరిగి రామవరంలో ఆయన ఇంటి వద్ద వదిలి వెళ్లారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దంపతుల అవినీతిపై తన పోరాటాన్ని సాగిస్తానని తెలిపారు. అవినీతి బయటపడుతుందని పోలీసులతో ఎమ్మెల్యే నాటకమాడించారని ఆరోపించారు.

➡️