రుషికొండ భవనాల వినియోగంపై త్వరలో నిర్ణయం

Mar 1,2024 08:27 #opened, #rishi konda buildings

– మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

– ప్రారంభించిన శారధా పీఠాధిపతి

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం):రుషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఈ భవనాలను పర్యాటకం కోసం వినియోగించాలా? ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఉపయోగించాలా ? అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. రుషికొండపై నిర్మించిన భవనాలను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ రుషికొండపై 9.88 ఎకరాలలో టూరిజం ప్రాజెక్టు నిర్మించామని, గతంలో ఈ ప్రాంతంలో ఉన్న హరిత రిసార్ట్స్‌ స్థానంలోనే ఈ నిర్మాణాలు జరిగాయని తెలిపారు. ఈ భవన నిర్మాణాలకు అనేక అడ్డంకులు కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నాయని, వాటన్నింటినీ దాటుకుంటూ ప్రాజెక్ట్‌ను అన్ని అనుమతులతో పూర్తి చేశామని చెప్పారు. విశాఖపట్టణాన్ని రాజధానిగా చేయాలని సంకల్పించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయమై ఇప్పటికే ముగ్గురు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె.రోజా, వైసిపి రీజనల్‌ కో ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గోన్నారు.

సర్క్యూట్‌ టూరిజం బస్సులు ప్రారంభం

బీచ్‌ రోడ్డులో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన 12 సర్క్యూట్‌ టూరిజం బస్సులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె.రోజా గురువారం జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడలో మరో ఆరు బస్సులను దేవాదాయ శాఖ మంత్రి ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ యాత్రికులకు సంతృప్తికరంగా సౌకర్యాలు అందిస్తోందని తెలిపారు. పర్యాటక ప్యాకేజీలను మెరుగుపరచుకోవడంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలలో యాత్రికులకు నాణ్యమైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. టూర్‌ ప్యాకేజీ మార్గాలను వివరించారు.

➡️