రైతు ఉద్యమ స్ఫూర్తితో ‘ఉక్కు’ పోరాటం

Feb 10,2024 08:05 #ukkunagaram, #viskha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విజయం సాధించిన రైతు ఉద్యమ స్ఫూర్తితో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1093వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ కోక్‌ ఓవెన్‌ విభాగానికి చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు పివిఎస్‌బి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఒకవైపు ఉత్పత్తిని కొనసాగిస్తూనే మరోవైపు ప్లాంటును కాపాడుకోవడానికి కార్మికులు అహర్నిశలూ కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమ పోరాటం రానున్న కాలంలో మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

➡️