టిడిపి నేతలపై అక్రమ కేసులు – గవర్నరుకు చంద్రబాబు లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:టిడిపి నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అక్రమ కేసులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేధిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు గవర్నరు అబ్దుల్‌ నజీర్‌కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను వేధించేందుకు ఎపిఎస్‌డిఆర్‌ఐను ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోందని విమర్శించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని వివరించారు. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు. శరత్‌ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్‌ డైరెక్టరుగా విధులు నిర్వహించారని తెలిపారు. అయినా ఎపిఎస్‌ఆర్‌డిఐ డిప్యూటీ డైరెక్టరేట్‌ సీతారామ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. కేంద్ర సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌ విచారణ చేస్తుండగానే మళ్లీ అదే అంశాన్ని ఎపిఎస్‌ఆర్‌డిఐ విచారణకు స్వీకరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసలు ఈ సంస్థ ఎందుకు స్థాపించబడింది? దాని లక్ష్యాలు ఏమిటి? ఏర్పాటయ్యాక ఎన్ని కేసులు నమోదు చేసింది? అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో దీని వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలిపారు. ఈ సంస్థను దుర్వినియోగం చేసే ప్రభుత్వ చర్యలను నిలువరించాలని కోరారు.

➡️