సమాచారం లేకుండా విద్యుత్‌ సరఫరా ఆపేస్తే కఠిన చర్యలు: ఎస్పీడీసీఎల్‌

Feb 25,2024 17:02 #current, #hyderabad

హైదరాబాద్‌ : స్థానికులకు ముందస్తు సమాచారం లేకుండా ఏ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిపేసినా, రికార్డులో చూపకుండా ఎల్‌సీలు తీసుకొని పనులు చేపట్టినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీడీసీఎల్‌ అధికారులు హెచ్చరించారు. అనధికారికంగా ప్రైవేట్‌ కాంట్రాక్టర్లు చేపడుతున్న పనులకు మద్దతు తెలిపే అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. సైబర్‌సిటీ సర్కిల్‌ కొండాపూర్‌ డివిజన్‌ అల్లాపూర్‌ సెక్షన్‌లో శుక్రవారం ఓ లైన్‌మన్‌ అనధికారికంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేసి, ఇద్దరు ఆర్టిజన్లతో కలిసి ఓ ప్రైవేట్‌ భవనానికి విద్యుత్‌తీగలు మార్చడంపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

వేసవిలో నమోదయ్యే సమ్మర్‌ డిమాండ్‌, విద్యుత్‌ సరఫరాలో తలెత్తే అంతరాయాలపై టీఎసఎస్పీడీసీఎల్‌ సీఎండీ ఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ప్రతిరోజు ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. తరుచూ అంతరాయాలు తలెత్తే ప్రాంతాలను గుర్తించి సంబంధిత డివిజన్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

విద్యుత్‌ సరఫరా లేదంటూ తప్పుడు ఫోన్‌ నెంబర్లతో ఫిర్యాదులు చేసినా, సోషల్‌ మీడియాలో ఫేక్‌ ఐడీలతో మెసేజ్‌లు పంపినా వారిపై సైబర్‌ క్రైంలో ఫిర్యాదులు చేస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు.

➡️