స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం దుర్మార్గం

Feb 10,2024 20:06 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):వేలాదిమందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం దుర్మార్గమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1094వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ సింటర్‌ప్లాంట్‌ ఉద్యోగులు, ఉక్కు విశ్రాంత ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు ఎన్‌ రామారావు, జె అయోధ్యరాం, డి ఆదినారాయణ మాట్లాడారు. కేంద్ర బిజెపి మోసపూరిత విధానాలపై పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ చెలిమి చేయడం తగదన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్‌, ఎపికి ప్రత్యేక హోదా.. ఇలా అన్నింటా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడం ఆనందకరమన్నారు. అదే సమయంలో ఆ ఉత్పత్తులను అందించే కార్మిక వర్గానికి నేటి వరకు నూతన వేతనాలు అమలు చేయకుండా యాజమాన్యం నిరంకుశంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఉక్కు విశ్రాంతి ఉద్యోగులు తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 16న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు ఎ శ్రీనివాస్‌, జి బోసుబాబు, రఫీ, దీనబంధు, నారాయణరావు, గురప్ప పాల్గొన్నారు.

➡️