అప్పులు చేసి పంటలు సాగుచేశాం

Dec 14,2023 22:01 #Central Drought Team, #paryatana

– వర్షాల్లేక పంటలన్నీ ఎండిపోయాయి

– ఆదుకోవాలని కేంద్ర కరువు బృందం ఎదుట రైతుల ఆవేదన

ప్రజాశక్తి- యంత్రాంగం’:అప్పులు చేసి పంటలు సాగుచేసినా కన్నీరే మిగిలింది. వ్యయప్రయాసలకోర్చి సాగు చేసినా వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయి. తీవ్రంగా నష్టపోయాం.. తమను ఆదుకోండి’ అంటూ కేంద్ర బృందం ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాలు గురువారం చిత్తూరు, నంద్యాల, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో పర్యటించాయి. కృష్ణ, గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ డైరెక్టర్‌ పి.దేవేంద్రరావు నేతృత్వంలో కేంద్ర బృందం సభ్యులు డిపార్‌టమెంట్‌ ఆఫ్‌ అనిమల్‌ హస్బెండరీ, డైరీయింగ్‌ అంజు బసెరా, ఎంఎన్‌సిఎఫ్‌సి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని గుండ్లపల్లి, శ్రీరంగరాజపురం గ్రామాల్లో వేరుశెనగ పంట పొలాల్లో కేంద్ర బృందం పర్యటించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఎకరా వేరుశెనగ పంటకు దాదాపు రూ.35 వేలు ఖర్చవుతోందని, పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నామని, ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని రైతులు కేంద్ర బృందం ఎదుట వాపోయారు. పలమనేరు, రామకుప్పం మండలాలలో నీటిలభ్యత తక్కువగా ఉందని, శాశ్వత నీటివసతి లేదని కేంద్ర బఅందానికి జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు వివరించారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అందిన అభ్యర్థనలను ఉన్నతాధికారులకు నివేదిక పంపి పరిష్కరించేందుకు కఅషి చేస్తామని పి.దేవేంద్రరావు తెలిపారు.ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఇంటర్‌ మినిస్ట్రీయల్‌ సెంట్రల్‌ టీమ్‌ లీడర్‌ పంకజ్‌ యాదవ్‌ నేతృత్వంలోని కేంద్ర బఅంద సభ్యులు పొన్నుస్వామి, అనురాగ దీక్షిత్‌ పర్యటించారు. తిరువూరు మండలంలో ఎండిపోయిన వరి, పత్తి పంటలను పరిశీలించారు. లక్ష్మీపురం దళితపేటలో తుంపుర మోషే సాగుచేసిన పత్తి పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌రంగాపురంలో కేంద్ర కరువు బృందం సభ్యులు, నీతి ఆయోగ్‌ సీనియర్‌ రీసర్చ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అనురాధ, జలశక్తి మంత్రిత్వ శాఖ తాగునీరు, పారిశుధ్య విభాగం అసిస్టెంట్‌ అడ్వైజర్‌ సంతోష్‌, డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ అండర్‌ సెక్రెటరీ సంగీత్‌ కుమార్‌ పర్యటించారు. దెబ్బతిన్న కంది పంటను పరిశీలించారు. బేతంచేర్ల, పగిడ్యాల, మిడుతూరు మండలాల కరువు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

➡️