– నెల్లూరు నారాయణ వైద్యశాల సూపరింటెండెంట్
ప్రజాశక్తి-నెల్లూరు :క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని నెల్లూరులోని నారాయణ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం వైద్యశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌జిల్లా జమ్మలమడుగుకు చెందిన గురుస్వామి (57) తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకున్నారని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు తమ ఆస్పత్రికి తీసుకువచ్చారని తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెదడులో ఐదు ఎన్యురిజంలు (మల్టిపుల్ ఇంట్రాక్రేనియల్ ఎన్యురిజమ్స్) ఏర్పడినట్లు, వాటి కారణంగా రక్తస్రావం జరిగినట్లు గుర్తించామన్నారు. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టరు సాయికిరణ్ శస్త్రచికిత్స చేసి బాధితుడిని కాపాడారని తెలిపారు. గతంలో నెల్లూరు జిల్లా కురుగొండకు చెందిన ఉష, తోటపల్లి గూడూరుకు చెందిన పి. రమణమ్మకు సైతం ఇదే తరహా శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.
